కలవరం పుట్టించిన రాములమ్మ గళం

రాములమ్మగా యావత్తు తెలుగు ప్రజల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న విజయశాంతి…ప్రస్తుతం అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఓ ఉద్యమకారిణి మాదిరిగా సోమవారం శాసనమండలిలో ఆమె చేసిన ప్రసంగం దాదాపుగా అన్ని పార్టీలనూ కలవరానికి గురి చేసిందనే చెప్పాలి.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉద్యమంలో ముందుండి నడిచి, ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వారి కుటుంబాలకు చేయాల్సిన సాయం గురించి ఆమె ఓ రేంజిలో వాయిస్ ను వినిపించారు. తాను కొనసాతున్న కాంగ్రెస్ పార్టీని కూడా ఈ విషయంలో ప్రశ్నించిన తీరు నిజంగానే తెలంగాణ వాదులను ఆకట్టుకుందని చెప్పాలి.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో విజయశాంతి కూడా కీలకంగానే వ్యవహరించారు. ఉద్యమకారులతో కలిసి ఆమె పోరుబాటలో ముందు వరుసలోనే సాగారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినప్పటికీ రాజకీయంగా మాత్రం రాములమ్మ పయనం ఆశించినంతగా సాగలేదనే చెప్పాలి.

కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అంటూ తిరిగిన రాములమ్మ చివరకు కాంగ్రెస్ పార్టీలోకే చేరిపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక… రాములమ్మకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ… ఆమెకు తగిన గుర్తింపు ఇచ్చిందన్న వాదన అయితే బలంగా వినిపించింది. ఇలాంటి తరుణంలో ఉద్యమకారులకు సాయంపై ఆమె తన పార్టీనే ప్రశ్నిస్తూ చేసిన ప్రసంగం ఇప్పుడు సర్వత్రా చర్చకు తెర లేసింది.

ప్రస్తుతం కొనసాగుతున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం శాసనమండలిలో విజయశాంతి కీలక ప్రసంగం చేశారు. ఉద్యమకారుల త్యాగాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఇప్పటికే  12 ఏళ్లు దాటిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.

ఉద్యమకారులే లేకుంటే తెలంగాణలో ఇంత మందికి మంత్రి పదవులు వచ్చేవా? సీఎం పదవి వచ్చేదా? అని రాములమ్మ ఒకింత ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఉద్యమకారుల త్యాగాలతో పదవులు దక్కించుకున్న నేతలు… ఉద్యమకారులకు చేయాల్సిన సాయంపై మాత్రం ఆపక్తి చూపడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని కీర్తించిన రాములమ్మ… ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలులో మాత్రం వెనుకబడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండేళ్లు దాటిపోయిందన్న రాములమ్మ… ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలులో ఇప్పటికైనా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ విషయంపై ఓ కమిటీని సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారన్న విషయాన్ని ప్రస్తావించిన రాములమ్మ… ఆ కమిటీతో జాప్యం జరుగుతుందని తెలిపారు. కమిటీని పక్కనబెట్టి ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలును తక్షణమే పట్టాలెక్కించాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు తోడ్పాటు అందిస్తామన్న హామీని కూడా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా రాములమ్మ గుర్తు చేశారు.