ప్రభుత్వంపై అధికారిక ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, న‌ల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మ‌రోసారి ఆగ్ర‌హానికి, ఆవేద‌న‌కు గుర‌య్యారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌న‌కు కేబినెట్‌లో చోటు ద‌క్క‌లేద‌ని పెద్ద ఎత్తున స‌ర్కారుపై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు.. ఒక వ‌ర్గానికే ప‌ద‌వులు ద‌క్కుతున్నాయ‌న్నారు. ఒకే కుటుంబంలో ఇద్ద‌రికి ప‌ద‌వులు ఇవ్వ‌డం త‌ప్పెలా అవుతుంద‌ని గ‌తంలో ఆయ‌న తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. అయినా.. ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు.

తాజాగా నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధి, ప్ర‌భుత్వం ఇచ్చే నిధుల‌పై రాజ‌గోపాల్ కీల‌క కామెంట్లు చేశారు. ప్ర‌భుత్వం ఇచ్చే నిధులు చేప‌డుతున్న ప‌నులు అన్నీ ఖ‌మ్మం జిల్లాకే వెళ్లిపోతున్నాయ‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఈ జిల్లాలో ముగ్గురు మంత్రు లు(తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, భ‌ట్టి విక్ర‌మార్క‌, పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి) ఉన్నార‌ని తెలిపారు. వీరికే అన్నీ అందుతున్నాయ‌ని చెప్పారు. ఇక‌, సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం కొడంగ‌ల్‌కు కూడా భారీ ఎత్తున నిధులు ఇస్తున్నార‌ని ఆరోపించారు. “నేను ఎమ్మెల్యేగా ఉండి ప్ర‌యోజ‌నం ఏంటి?“ అని ప్ర‌శ్నించారు.

“సీఎం నియోజ‌క‌వ‌ర్గం ఆయ‌న‌కు ఎంత ముఖ్య‌మో.. మా నియోజ‌క‌వ‌ర్గాలు.. మ‌మ్మ‌ల్ని గెలిపించిన ప్ర‌జ‌లు మాకు అంతే ముఖ్యం. మా నియోజ‌క‌వ‌ర్గాల‌ను అభివృద్ధి చేసుకోవాల‌ని మాకు కూడా ఉంటుంది. మాకు నిధులు ఎందుకు ఇవ్వ‌రు?“ అని కోమ‌టిరెడ్డి ప్ర‌శ్నించారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కేవ‌లంమంత్రులు, ముఖ్య‌మంత్రి నియోజ‌క‌వ‌ర్గాలు మాత్ర‌మే అభివృద్ది చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందిన‌ట్టు అవుతుందా? అని నిల‌దీశారు.

మధిర, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాలకే ఎత్తిపోత‌ల ప‌థ‌కాలు వెళ్తున్నాయ‌ని ఆరోపించారు. అంతేకాదు.. గ‌త రెండున్న‌రేళ్లుగా తాను మాన‌సికంగా ఎంతో ఆవ‌దేన వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలిపారు. అయినా.. త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు. నియోజ‌క‌వ‌ర్గాల‌కు నిధులు ఇవ్వ‌క‌పోతే.. ఎలా అభివృద్ధి ప‌నులు ముందుకు సాగుతాయ‌ని ప్ర‌శ్నించారు. ఇలా.. చేస్తే..తాను ఎమ్మెల్యేగా ఉండి ప్ర‌యోజ‌నం ఏంట‌ని వ్యాఖ్యానించారు.