వైసీపీని `నెంబరు 11` వెంటాడుతోంది. 2024లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాల్లోనే విజయం దక్కింది. వాస్తవానికి వైనాట్ 175 అన్నా కూడా.. ప్రజలు మాత్రం 11 సీట్లకే పరిమితం చేశారు. ఇక, అప్పటి నుంచి `లెవెన్ రెడ్డి` అనే పేరు జగన్‌కు.. `11 మెంబర్స్` అనే పేరు వైసీపీ ఎమ్మెల్యేలకు స్థిరపడిపోయింది. ఇక, తరచుగా ఈ విషయం రాజకీయంగా కూడా… జగన్‌కు, ఆ పార్టీ నాయకులకు ఇబ్బందిగా మారినప్పటికీ.. ప్రత్యర్థులు మాత్రం ఆటపట్టిస్తూనే ఉన్నారు.
ఈ నెల ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలను కూడా 11వ తేదీనే ప్రారంభించడం.. 11 గంటల 11 నిమిషాలకు సభను మొదలు పెట్టడంపైనా అనేక సెటర్లు పడ్డాయి. వైసీపీ దీని నుంచి తమనుతాము రక్షించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ, ప్రజలు ఇచ్చిన తీర్పు కారణంగా.. వైసీపీకి ఈ సమస్య కొనసాగుతోంది. ఇక, తాజాగా పార్లమెంటు వేదికగా కూడా.. వైసీపీకి ఈ 11 ఇబ్బంది తప్పలేదు. చిత్రంగా ఉన్నప్పటికీ.. నిజం!.
పార్లమెంటు కొత్త భవనంలో పార్టీలకు రూములు కేటాయించే సంప్రదాయం ఉంది. గతంలో ఉన్నపాత భవనాన్ని పూర్తిగా ఖాళీ చేసి.. ప్రస్తుతం కట్టిన సెంట్రల్ విస్టా(కొత్త పార్లమెంటు)లో పార్టీల వారీగా వారి వారి సభ్యుల సంఖ్యను బట్టి.. రూములు కేటాయిస్తున్నారు. తాజాగా వైసీపీకి రూమ్ నెంబరు 11 కేటాయించారు. ఇది పూర్తిగా స్పీకర్ ఓం బిర్లా విచక్షణ మేరకు జరిగే నిర్ణయం. అయితే.. దీనిపై వైసీపీ ఎంపీలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
స్పీకర్ కార్యాలయంలోకి వెళ్లిన వైసీపీ ఎంపీలు.. తమకు రూమ్ 11 కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. ఇదేసమయంలో వారి వాదనను బలంగా వినిపించారు. తమను అవమానించేందుకు కొందరు కుట్ర చేశారని.. దీనిని స్పీకర్ అనుమతించరాదని వారు అభ్యర్థించారు.
అయినప్పటికీ.. ఒక్కసారి కేటాయించిన రూములను మార్చబోమని స్పీకర్ తెగేసి చెప్పారు. చివరకు ఉత్తరాదికి చెందిన ఓ కేంద్ర మంత్రి జోక్యంతో వైసీపీ సభ్యుల విజ్ఞాపనకు స్పీకర్ అంగీకరించారు. అనంతరం.. వారికి రూమ్ నెంబరు 12ను కేటాయించారు. అయితే.. పార్లమెంటులోనూ వైసీపీని 11 వెంటాడడం ఆసక్తిగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
