తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులకు బిగ్ ఆఫర్ ప్రకటించారు. ఇదేసమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావుకు సెగ పెంచేశారు. సిద్దిపేట నుంచి విజయం దక్కించుకునే కాంగ్రెస్ నేత ఎవరైనా సరే.. మంత్రి వర్గంలో సీటు ఖాయమని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. సిద్దిపేట ఎవరి జాగీరూ కాదన్న రేవంత్.. కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ గెలిచి తీరుతుందని తేల్చి చెప్పారు.
తాజాగా సిద్దిపేటలో రైతుల భరోసా(పెట్టుబడి సాయం) నిధులు విడుదల చేసిన సీఎం.. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. గత పాలకులు.. వ్యక్తులు.. నాయకుల విషయంలోనే కాకుండా.. నియోజకవర్గాల విషయంలోనూ వివక్ష చూపించారని దుయ్యబట్టారు.
అందుకే కాంగ్రెస్ పార్టీ గెలిచిన నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరగలేదన్నారు. కానీ, తాము ప్రతిప క్ష నాయకుడు గెలిచిన నియోజకవర్గంలో(సిద్దిపేట)నే ప్రభుత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామ న్నారు. రైతులకు మేలు జరిగే భరోసా నిధులు విడుదలచేశామన్నారు. ఇది.. తమకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న తేడా అని వివరించారు. సిద్దిపేట అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందుకే భారీగా నిధులు కూడా ఇచ్చామన్నారు.
పేరు ఎత్తకుండానే..
ఈ సందర్భంగా హరీష్‌రావు పేరు ఎత్తకుండానే ఆయనపై విమర్శలు గుప్పించారు. తాను వ్యక్తులతో విభేదించనని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేవలం విధానాలను, రాజకీయపరమైన అంశాలను మాత్రమే విభేదిస్తానన్నారు. అందుకే.. సిద్దిపేటలోనే పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ సహా.. రిఫైనరీకి కూడా శంకు స్థాపన చేస్తున్నామన్నారు. తాను విభేదించే వ్యక్తినే అయితే.. ఈ ప్యాక్టరీని తన నియోజకవర్గానికి తీసుకుపోయి ఉండే వాడినని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates