శ్రీవారి ఆలయానికి సాధారణ భక్తుడిలా.. చంద్రబాబు!

ఆయన ఏపీకి ముఖ్యమంత్రి. ఒక్కసారి కాదు, నాలుగోసారి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయానికి ఆయన మహాద్వారం నుంచి లోపలికి ప్రవేశించేందుకు అవకాశం ఉంది. కానీ ఆయన సాధారణ భక్తుడిలా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుపతి పర్యటనలో భాగంగా శనివారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక ప్రవేశం ఉన్నా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి నడుచుకుంటూ వెళ్లి వేంకటేశ్వర స్వామిని దర్శించారు.

సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఈ దర్శనం జరిగింది. ముఖ్యమంత్రి వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి కూడా ఉన్నారు.

శ్రీవారి దర్శనం అనంతరం అధికారులు స్వామివారి ప్రసాదాలను అందించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన కాంప్లెక్స్‌లో అన్న ప్రసాదం వడ్డించనున్నారు. ఒక్కరోజు అన్నదానానికి అవసరమైన రూ.44 లక్షల విరాళాన్ని ఇప్పటికే అందించారు.

ఇప్పటి వరకు 12 సార్లు ఎస్వీ అన్నదాన ట్రస్ట్‌కు ముఖ్యమంత్రి కుటుంబం విరాళాలు ఇవ్వడం విశేషం. దేవాన్ష్ పుట్టిన నాటి నుంచి ప్రతి ఏడాది ఈ విరాళం అందిస్తున్నారు.

సాఫీగా క్యూలైన్లు..

సాధారణంగా వీవీఐపీలు దర్శనానికి వస్తే భక్తుల క్యూలైన్లు నిలిపివేస్తారు. దీంతో సాధారణ భక్తులు ఇబ్బందులు పడతారు. కానీ ఈసారి సీఎం కుటుంబం దర్శనం చేసుకున్నప్పటికీ క్యూలైన్లు ఆపలేదు. ఒకవైపు సీఎం కుటుంబం దర్శనం చేసుకుంటుండగా మరోవైపు భక్తుల దర్శనం కూడా సాఫీగా కొనసాగింది.