సీఎం చంద్రబాబు మంత్రి వర్గంలో మౌనంగా ఉంటూ పనులు చక్కబెట్టే మంత్రిగా నారాయణకు మంచి పేరుంది. అందుకే ఆయనకు కీలకమైన రాజధాని పనులను అప్పగించారు. ఒకవైపు పురపాలక శాఖ మంత్రిగా ఉంటూనే మరోవైపు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ అమరావతి నిర్మాణం, కాంట్రాక్ట్ సంస్థల ఎంపికపై దృష్టి పెట్టుతున్నారు. పనులు వేగంగా సాగేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో సీఆర్‌డీఏ కమిషనర్లకు, మంత్రికి మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి.
ఏరికోరి తీసుకొచ్చిన సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబును కూడా తాజాగా ప్రభుత్వం బదిలీ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 20 నెలల్లో ఇద్దరు కమిషనర్లు మారిపోయారు. కానీ మంత్రి మాత్రం మారలేదు. నారాయణ ఆధ్వర్యంలోనే పనులు కొనసాగుతున్నాయి. అయితే కమిషనర్లతో ఆయనకు సర్దుబాటు కుదరడం లేదు.
2024 అక్టోబరులో కాటంనేని భాస్కర్‌ను సీఆర్‌డీఏ కమిషనర్‌గా నియమించారు. కానీ ఆరు నెలలకే ఆయనను తప్పించారు. రైతుల సమస్యలపై కమిషనర్ అభిప్రాయాలకు, మంత్రికి మధ్య విభేదాలు రావడం దీనికి కారణంగా చెబుతున్నారు. అలాగే సీఆర్‌డీఏను విభజించే అంశంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఆ తర్వాత కన్నబాబుకు అవకాశం ఇచ్చినా, ఆయన కూడా ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. తన అధికారాలను తగ్గిస్తున్నారనే భావనతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వేర్వేరు శాఖలకు బాధ్యతలు పంచడం వల్ల తన పాత్ర తగ్గిపోయిందని భావించారు.
ఈ పరిణామాల మధ్య మంత్రికి, అధికారులకు మధ్య విభేదాలు పెరిగిన నేపథ్యంలోనే ఈ మార్పులు జరిగినట్లు తెలుస్తోంది.
తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారి విజయరామరాజును సీఆర్‌డీఏ కమిషనర్‌గా నియమించారు. అయితే ఇలా వరుస మార్పులు చేస్తే రాజధాని పనుల వేగం తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. అయినప్పటికీ మంత్రి తన విధానంలోనే ముందుకు సాగుతున్నారని చెబుతున్నారు. చివరకు పనులు ఆలస్యమైతే అది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే అవకాశముంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
