పోయినసారంటే రాష్ట్రప్రయోజనాలని, తిరుపతి లోక్ సభలో పోటీ చేసే విషయమై చర్చించేందుకు చెప్పిన పవన్ కల్యాణ్ ఈసారి ఎందుకు ఢిల్లీకి వెళుతున్నట్లు ? ఈనెలాఖరులో రెండు రోజుల ఢిల్లీ టూర్ పెట్టుకున్నారట పవన్. ఎందుకెళుతున్న విషయంపై పార్టీ నేతల్లోనే పూర్తి స్పష్టతైతే లేదు. కాకపోతే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అడగటానికే వెళుతున్నారనే టాక్ అయితే నడుస్తోంది.
ఇలా ఢిల్లీకి వెళ్ళి అలా అవకాశం ఇవ్వమని అడగ్గానే ఇచ్చేస్తారా ? అనే ప్రశ్న చాలా కీలకమైంది. ఎందుకంటే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ నేతలు చాలా ఉబలాటపడిపోతున్నారు. నిజానికి మొన్నటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికన్నా నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్)కే ఎక్కువ ఓట్లు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి ట్రాక్ రికార్డున్న పార్టీ తరపున రేపటి ఉపఎన్నికల్లో పోటీ చేసినా ఫలితంలో పెద్ద తేడా ఏమీ ఉండదనే అనుకుంటున్నారు.
అలాంటిది పోటీ చేసే విషయంలో బీజేపీ దూకుడు చూపుతోంది. ఆ దూకుడుకు కళ్ళెం వేయాలని జనసేన అధినేత పవన్ కల్యాన్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. పోనీ జనసేనకు ఏమైనా బ్రహ్మండమైన బలముందా అంటే అదీలేదు. ఎందుకంటే ఇప్పటివరకు జనసేన తిరుపతి లోక్ సభలో పోటీనే చేయలేదు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన బిఎస్పీ అభ్యర్ధికి జనసేన మద్దతిచ్చిందంతే. ఇంతోటి భాగ్యానికే తిరుపతి లోక్ సభ పరిధిలో తమకు అపారమైన బలముందని జనసేన నేతలు చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది.
మరప్పుడు బీఎస్పీ అభ్యర్ధికి ఎన్ని ఓట్లొచ్చాయంటే బీజేపీకన్నా కాస్త ఎక్కువొచ్చాయంతే. అంటే బలం ప్రకారం చూస్తే రెండుపార్టీలు దాదాపు సమానంగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. మరిలాంటపుడు రెండుపార్టీల్లో ఏది పోటీ చేసినా ఫలితంలో పెద్దగా తేడా ఏమీ ఉండదనే అనుకోవాలి. ఇంతోటి దానికి రెండుపార్టీలు కూడా ఎందుకింతగా పంతానికి పోతున్నాయో అర్ధం కావటం లేదు. సరే ఒకసారి వెళ్ళి ఏదో నడ్డాను కలిసొచ్చానని చెప్పుకున్నారు. మరిపుడు రెండోసారి ఎందుకెళుతున్నట్లు ?
Gulte Telugu Telugu Political and Movie News Updates