వైసీపీ అధినేత జగన్‌కు కొన్ని జాగ్రత్తలు సూచిస్తూ.. ఓ అపరిచిత ఐఏఎస్ లేఖ రాసినట్టు వైసీపీ నాయకులు చెబుతున్నారు. అయితే.. సదరు ఐఏఎస్ అధికారి ఎవరు? అనే విషయాన్ని మాత్రం గోప్యం ఉంచారు. వాస్తవానికి ఆ ఐఏఎస్ అదికారి కూడా తన పేరును వెల్లడించకుండానే.. ఈ లేఖ రాసినట్టు చెబుతున్నారు. గత వైసీపీ హయాంలో కీలక పోస్టులో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారే ఈ లేఖ రాసి ఉంటారని అంటున్నారు.
లేఖ సారాంశం ఇదీ..
జగన్‌కు ఈ లేఖలో సదరు ఐఏఎస్ అధికారి కొన్ని సూచనలు చేసినట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రధానంగా జగన్‌ను.. మరింత పలుచన చేసేందుకు రాజకీయ వ్యూహాలు రెడీ అవుతున్నాయన్నది ఆయన చెప్పినట్టుగా వైసీపీ నాయకులు తెలిపారు. జగన్‌ను ఉత్తర కొరియా అధిపతి `కిమ్`మాదిరిగా సృష్టించనున్నారని.. దీనిపై ప్రజల్లో ప్రచారం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది ఆయన వాదనగా ఉందని అంటున్నారు.
ఇదేసమయంలో.. జగన్ బయటకు రాకపోతే.. మరింతగా పార్టీ నష్టపోతుందని.. తాను చేసినవి చెప్పుకోవడంలో జగన్ వెనుకబడ్డారని.. ఆయనే ఒప్పుకొన్న విషయాన్ని కూడా ఐఏఎస్ అధికారి లేఖలో ప్రస్తావించారని కూడా పేర్కొంటున్నారు. అంతేకాదు.. కార్యకర్తలకు ఇప్పటి నుంచే మరింత భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని.. వారు ఉత్తేజంగా లేకపోవడం.. పార్టీ పరంగా కార్యక్రమాలకు హాజరు కాకపోవడం వంటివి కూడా జగన్‌కు ఇబ్బందేనని ఆయన పేర్కొన్నట్టు పార్టీ నాయకులు తెలిపారు.
ప్రస్తుతం వివాదాలపైనా సదరు ఐఏఎస్ అధికారి జగన్‌కు కీలక సూచనలు చేశారని తెలిసింది. తిరుమల లడ్డూ వ్యవహారంపై వైసీపీ మౌనంగా ఉండాలని.. మద్యం కుంభకోణంపైనా ఇదే విధానం పాటించాలని ఆయన సూచించారు. అదేసమయంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి అతిగా అంచనాలు వేసుకోకుండా.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించి అడుగులు వేయాలని ఆయన సూచించడం గమనార్హం. అయితే.. సదరు ఐఏఎస్ ఏపీకి చెందిన వ్యక్తి కాదని కొందరు చెబుతున్నారు. ఉత్తరాదికి చెందిన వ్యక్తి అని కొందరు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
