పూజ గదిలో బొమ్మపై క్లారిటీ ఇచ్చిన లోకేష్

ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ తన పూజ గదిలో ఉన్న బొమ్మలపై సోషల్ మీడియాలో వస్తున్న సందేహాలకు స్పష్టత ఇచ్చారు. తన కుమారుడు దేవాంశ్ నారా చిన్ననాటి భక్తిని గుర్తుచేసుకుంటూ ఆయన భావోద్వేగ ట్వీట్ చేశారు.

పూజ గదిలో కనిపిస్తున్నవి శివుడు బొమ్మతో పాటు ఒక చిన్న శివలింగమని తెలిపారు. అవి తన కుమారుడు దేవాంశ్ నారా కేవలం నాలుగేళ్ల వయసులో స్వయంగా తయారు చేసినవని వెల్లడించారు. చిన్నప్పటి నుంచే అతనిలో భక్తి భావం పెంపొందిందని, ఆ మధుర జ్ఞాపకంగా వాటిని పూజ గదిలో ఉంచుకున్నామని చెప్పారు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొన్ని అపోహలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్న ఆయన, కొందరికి భక్తి అర్థమవుతుందని, మరికొందరికి అర్థం కాకపోవచ్చని వ్యాఖ్యానించారు. అయితే చిన్నారి భక్తి ఎంతో పవిత్రమైందని స్పష్టం చేశారు. లోకేష్ ఇచ్చిన ఈ వివరణతో అనవసర వివాదాలకు తెరపడినట్లు భావిస్తున్నారు.

నిన్న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి నారా లోకేష్ తన కుమారుడితో కలిసి ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో తీపి క్షణాలు ఎక్కువగా, చేదు అనుభవాలు తగ్గాలని ఆకాంక్షించారు.

పండుగ సందర్భంగా ప్రత్యేక వంటకాలను ఆస్వాదించేందుకు ఒక రోజు తన కఠిన ఆహార నియమాలను పక్కన పెట్టనున్నట్లు సరదాగా పేర్కొన్నారు. పండుగ సందర్భంగా ఆయన షేర్ చేసిన ఫోటోలో ఉన్న బొమ్మపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేయగా, వాటికి చెక్ పెడుతూ వెంటనే వివరణ ఇవ్వడం గమనార్హం.