ఏపీ రాజకీయాల్లో ఇటీవల ‘పరివర్తన రాజనీతి పార్టీ` (పీఆర్‌పీ) పేరుతో ఒక కొత్త రాజకీయ పార్టీని మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి ప్రారంభించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు కూడా అయిన సాయిరెడ్డి ఈ నెల 11న విజయవాడ వేదికగా ఈ పార్టీని అధికారికంగా ప్రకటించారు. అయితే.. ఆయన అనూహ్యంగా ఆ తర్వాత రోజు నుంచి మీడియా ముందుకు రాలేదు. పార్టీ ఆవిర్భావ సభలో పెద్ద ఎత్తున వైసీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. కూటమి సర్కారులో టీడీపీని కూడా కార్నర్ చేసుకున్నారు.
యువతకు తాను అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. సీఎం పోస్టు నుంచి మంత్రుల వరకు అన్ని పోస్టులను కూడా రిజర్వేషన్ కేటగిరీలోకి తీసుకువస్తానని తెలిపారు. మొత్తంగా.. నిద్రాణంలో ఉన్న యువతను రాజకీయ బాట పట్టించనున్నట్టు కూడా సాయిరెడ్డి వెల్లడించారు. ఈ క్రమంలోనే తాను కూడా పదవులకు దూరంగా ఉండి కేవలం మెంటార్‌గానే పనిచేస్తానన్నారు. సో.. మొత్తంగా ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది. కానీ, ఆ తర్వాత.. సాయిరెడ్డి సైలెంట్ అయ్యారు. కేవలం మళ్లీ ఎక్స్‌లోనే రియాక్ట్ అవుతున్నారు.
తాజాగా సాయిరెడ్డి తాను పార్టీ స్థాపించిన నాలుగు రోజుల్లోనే 5 లక్షలకు పైగా సభ్యత్వాలను నమోదు చేసుకున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఇది తనకు ఎంతో ఊపు తెస్తోందన్నారు. రాష్ట్రంలో రెండు కుటుంబాల ఆధిపత్య రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ఉండటమే తమ లక్ష్యమని ప్రకటించిన దరిమిలా.. ప్రజలు తమవైపు చూస్తున్నారన్నది సాయిరెడ్డి చెబుతున్నమాట. రాజకీయాల్లో యువతకు 60 శాతం అవకాశాలు కల్పిస్తామని, రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని చె్పిన విషయాన్ని , పదవుల విషయంలోనూ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పడంతో యువత తనవైపు చూస్తున్నారని అంటున్నారు.
అయితే.. సాయిరెడ్డి పార్టీ పీఆర్‌పీ సభ్యత్వ నమోదు వ్యవహారంపై సోషల్ మీడియాలోనే అనేక సందేహాలు వ్యక్తమ వుతున్నాయి. పార్టీ పెట్టిన కేవలం నాలుగు రోజుల్లోనే 5 లక్షల మంది సభ్యత్వం సాధ్యమేనా? అని చాలా మంది ప్రశ్నించారు. అసలు విజయవాడలో పార్టీ ప్రకటన, జెండా ప్రకటన చేసిన తర్వాత.. ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదని.. దీనికి కారణం ఏంటని కొందరు ప్రశ్నించారు. అదేసమయంలో అసలు సభ్యత్వ నమోదుకు సంబంధించిన అంశాలపైనా కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదెలా ఉన్నా.. సాయిరెడ్డి చెప్పినట్టు 5 లక్షల మంది సభ్యత్వం తీసుకుంటే నిజంగా సాయిరెడ్డి సక్సెస్ అయినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates