నిన్నటి వరకు భయపెట్టిన అక్వాన్ తుఫాన్ ఒడిశా వైపు మెల్లగా జారుకుంది. ఆంధ్ర ప్రదేశ్ కు తుఫాన్ ముప్పు తప్పింది. తొలుత అక్వాన్ మచిలీపట్నం-చెన్నై మధ్య తీరం దాటుతుందని అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత కాకినాడ-విశాఖపట్నం మధ్య తీరం దాటుతుందని అంచనా వేశారు. మొదట్లో ఏపీ సమీపంలోకి వచ్చినట్టే కనిపించింది. తాజాగా ఈ తుఫాన్ దిశ మార్చుకుని ఒడిశావైపు పయనిస్తోంది. అయితే మొదట్నుంచి నెమ్మదిగా 3 కిలోమీటర్ల నుంచి 9 కిలోమీటర్ల వేగంతో కదులుతూ క్రమంగా సముద్రంలోనే బలహీన పడినట్లు వాతావరణ శాఖ అధికారులు వివరించారు.
ప్రస్తుతం ఒడిశావైపు వెళుతున్నప్పటికి మళ్ళీ దిశ మార్చుకునే సూచనలు కానవస్తున్నాయని అంచనా వేస్తున్నారు. కోల్కతా, బాంగ్లాదేశ్ తీరానికి చేరుకోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుత గమనం ప్రకారం చూస్తే మాత్రం దక్షిణ ఒడిశా వైపు పయనిస్తున్నట్టు కనిపిస్తుంది. స్థిరంగా ప్రయాణం చేయకుండా మధ్యలో ఏమైనా మారితే శ్రీకాకుళం, పూరి మధ్య దాటొచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఆంధ్ర ప్రదేశ్ కు తుఫాను ముప్పు తప్పినప్పటికీ ఉత్తరాంద్ర జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. దీంతో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని సమాచారం.
ఇప్పటికీ అక్వాన్ తుఫాను దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రతుఫానుగా కొనసాగుతూనే వుంది. గురువారం అర్ధరాత్రి వరకు తీవ్ర తుఫానుగా కొనసాగి శుక్రవారం మధ్యాహ్ననికి తుఫానుగా మారి తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. మొన్నటి మురసు తుఫాను ప్రభావం నుంచి ఆంధ్ర ప్రదేశ్ ఇంకా తెరుకోలేదు. మళ్ళీ ఇప్పుడు కనుక అక్వాన్ తుఫాను విరుచుకొని పడితే పరిస్థితి దారుణంగా ఉంటుందని రైతులు, ప్రభుత్వం ఆందోళనకు గురయ్యారు. లక్కీగా అక్వాన్ నెమ్మదించడంతో ఊపిరిపీల్చుకున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates