తమిళనాడు రాజకీయాలను, అక్కడి వ్యవస్థలను మార్చడమే లక్ష్యంగా పార్టీ పెట్టిన ప్రముఖుడు కమల్ హాసన్. ఒకప్పుడు రాజకీయాల్లోకి రానంటే రానని తేల్చి చెప్పిన ఆయన.. జయలలిత మరణానంతరం ఈ రంగం వైపు ఆసక్తి ప్రదర్శించడం.. రెండేళ్ల కిందట మక్కల్ నీది మయ్యం పేరుతో పార్టీ కూడా పెట్టడం తెలిసిన సంగతే.
గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో కమల్ పార్టీ నుంచి కొన్ని చోట్ల అభ్యర్థులు కూడా పోటీ చేశారు. వారు సరైన ఫలితాలు రాబట్టలేకపోయినా కమల్ ఏమీ నిరాశ చెందలేదు. ఆయన లక్ష్యమంతా వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించడమే. ఈ నేపథ్యంలో కమల్ ఇటీవల చురుగ్గా పార్టీ సమావేశాలతో పాటు అనేక రాజకీయ కార్యక్రమాల్లో భాగమవుతున్నారు.
ఇదిలా ఉండగా.. తమిళనాడును సరికొత్తగా మార్చేందుకు కమల్ పార్టీ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసింది. దీని మీద తమిళనాట ప్రముఖ మీడియా సంస్థల అధినేతలను కలిసి ఈ విజన్ డాక్యుమెంట్ గురించి చర్చించినట్లు కమల్ వెల్లడించాడు. ఈ డాక్యుమెంట్ విశేషాలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
దీని ప్రకారం ఉద్యోగాలు చేయకుండా ఇంటిపట్టున ఉంటూ అన్ని వ్యవహారాలూ చక్కబెట్టే గృహిణులకు (హౌస్ వైవ్స్) నెలవారీ జీతం ఇవ్వాలన్నది కమల్ పార్టీ సూచన. హౌస్ వైఫ్‌గా ఉండటం పెద్ద ఉద్యోగం. వాళ్లకు తగురీతిలో జీతం ఇవ్వాలి. అది కచ్చితంగా జరగాలి అని ఈ విజన్ డాక్యుమెంట్లో కమల్ పేర్కొన్నాడు. ఐతే గృహిణులకు వాళ్ల కుటుంబమే జీతం ఇవ్వాలా.. లేక ప్రభుత్వాలు ఇవ్వాలా అన్నది ఇందులో ప్రస్తావించలేదు. చెప్పడానికి బాగుంటుంది కానీ.. ఇలాంటివి అమలు చేయడం అనుకున్నంత తేలికైతే కాదు. ఇలాంటి కొన్ని వినూత్నమైన ఆలోచనలతో తాము రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌ను జనాల్లోకి తీసుకెళ్లాలని కమల్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది.