మా వల్లే గెలిచారు.. వివాదాలకు బాబు చెక్!

వివాదాస్పద నాయకులకు సీఎం చంద్రబాబు తనదైన శైలిలో చెక్ పెట్టారు. ఎవరికివారు తమంత వారు లేరని భావిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వివాదాలు కూడా అదేవిధంగా కొనసాగుతున్నాయి. గతం నుంచి వివాదాలకు దిగుతున్న నేతలు కొందరు అయితే, కొత్తగా మరికొందరు వివాదాలకు కేంద్రంగా మారుతున్నారు. దీంతో పైస్థాయిలో కూటమి నాయకుల మధ్య ఐక్యత ఉన్నప్పటికీ, గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఒకింత ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

తిరువూరు, సత్తెనపల్లి, సత్యవేడు, గుడివాడ, నూజివీడు ఇలా అనేక నియోజకవర్గాల్లో టీడీపీ నాయకుల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఇక మెజారిటీ నియోజకవర్గాల్లో కూటమి పార్టీల నేతల మధ్య సఖ్యత లోపిస్తోంది. తద్వారా క్షేత్రస్థాయిలో పార్టీల పరిస్థితి, అదేవిధంగా నేతల పరిస్థితి కూడా వివాదాలకు దారితీస్తోంది. నిజానికి ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు పార్టీ పరంగా చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కొన్ని కొన్ని వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ పరిణామాలను నిశితంగా గమనించిన చంద్రబాబు అసెంబ్లీ వేదికగానే ఎమ్మెల్యేల‌కు ఏకమొత్తంగా క్లాస్ ఇచ్చేశారు. ఎవరికివారు తామే బలవంతులం అనుకుంటున్నారని, అలా అయితే 2019లో ఎందుకు పరాజయం పాలయ్యారో ఆలోచించుకోవాలని చురకలు అంటించారు. తాను, పవన్ కళ్యాణ్, మోడీ ముగ్గురు కలిస్తేనే ప్రజలు విశ్వసించి ఓట్లేశారని, ఈ కూటమి సజావుగా సాగేందుకు నాయకులు కూడా కలిసి ఉండాలని తేల్చి చెప్పారు. అంతేకాదు, ఎవ‌రైనా తమకు సొంత బలం ఉంటుందని అనుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

కానీ కూటమిలో ఉన్న పవన్, మోడీ, తాను ప్రజలకు మరింత చేరువ అవుతున్నామని, క్షేత్రస్థాయిలో నాయకులు కీచులాడుకోవడం వస్తే అది వారికే నష్టమని వ్యాఖ్యానించారు. కలివిడిగా ఉంటేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలని అన్నారు. అలాకాదని అనుకుంటే అప్పుడు తెలుస్తుందని పరోక్షంగా హెచ్చరించారు. కూటమిగా ఉండాల్సిన అవసరం అందరికీ ఉంటుందని వ్యాఖ్యానించారు. మొత్తంగా ఎమ్మెల్యేల శైలిని చంద్రబాబు సభావేదికగానే తేల్చి చెప్పారు. మరి ఇప్పటికైనా మార్పు వస్తుందా? నాయకులు మారుతారా లేదా? అనేది చూడాలి.