తిరుమ‌ల‌లో కేక్ క‌టింగ్‌ ఏంటమ్మా మాధురి?

తిరుమ‌ల తిరుపతి దేవ‌స్థానం ప‌విత్ర‌త‌పై ఇప్ప‌టికే చ‌ర్చ సాగుతున్న నేప‌థ్యంలో దీనికి మ‌రింత సెగ పెంచేలా.. గురువారం ప‌లు ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. త‌మిళ‌నాడుకు చెందిన ఓ కొత్త జంట‌.. తిరుమ‌ల శ్రీవారి ఆల‌యం మ‌హా గోపురం ముందు..ఫొటో , వీడియో షూట్ చేసుకుంది. దీంతో పాటు.. కొంద‌రు యూట్యూబ‌ర్లు.. ఇక్క‌డే రీల్స్ చేశారు. ఈ ఘ‌ట‌న‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో తిరుమ‌ల తిరుప‌తి అధికారులు చ‌ర్య‌లు ప్రారంభించారు.

దీంతో పాటు.. వైసీపీ ఎమ్మెల్సీ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు దువ్వాడ శ్రీనివాస్ స‌హ‌చ‌రి దివ్వెల మాధురి మ‌రో బిగ్ బాస్ ఫేమ్‌.. త‌నూజ‌లు తిరుమ‌ల కొండ‌పై కేక్ క‌ట్ చేసి పుట్టిన రోజు వేడుక‌లు చేసుకున్నారు. గురువారం త‌నూజ పుట్టిన రోజు కావ‌డంతో తిరుమ‌ల ప‌రిస‌రాల్లోని ఓ గెస్ట్ హౌస్‌లో వేడుక‌లు నిర్వ‌హించారు. అయితే.. తిరుమ‌ల ప‌రిస‌రాల్లో కేకులు క‌ట్ చేయ‌డాన్ని పాల‌క మండ‌లి గ‌తంలోనే నిషేధించింది. ఇది మ‌న సంస్కృతి కాద‌ని.. విదేశీ సంస్కృతి అని అప్ప‌ట్లోనే తెలిపింది.

అయిన‌ప్ప‌టికీ.. దివ్వెల మాధురి, త‌నూజ‌లు పుట్టిన రోజు వేడుక‌ల పేరుతో ఇక్క‌డ కేక్ క‌ట్ చేశారు. అంతేకాదు.. విదేశీ సంప్ర‌దాయంలో వేడుక‌లు నిర్వ‌హించారు. దీనిని వీడియోలు తీసి.. సామాజిక మాధ్య‌మాల్లోనూ పోస్టు చేశారు. ఈ వ్య‌వ‌హారం వెలుగు చూడ‌గానే.. అధికారులు హుటాహుటిన స్పందించారు. తిరుమ‌ల పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. తిరుమ‌ల నిబంధ‌న‌లు, ఆచారాల‌కు విరుద్ధంగా విదేశీ సంప్ర‌దాయంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంపై కేసు న‌మోదు చేశారు.

అయితే.. మాధురి బ‌లవంతంతోనే తాను తిరుమ‌ల‌కు వ‌చ్చాన‌ని త‌నూజ చెప్పిన‌ట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై త‌మ‌కు ఫిర్యాదు అంద‌గానే త‌నూజ‌కు ఫోన్ చేశామ‌ని.. ఆమె త‌న ప్ర‌మేయం ఏమీ లేద‌ని.. వాస్త‌వానికి పుట్టిన రోజు వేడుక‌ను హైద‌రాబాద్ లో నిర్వ‌హించాల‌ని అనుకున్న‌ట్టు తెలిపార‌ని పోలీసులు చెప్పారు.

కానీ, మాధురి బ‌ల‌వంతంతోనే తాను తిరుమ‌ల‌కు వ‌చ్చిన‌ట్టు పేర్కొన్నార‌ని వెల్ల‌డించారు. కేక్ విష‌యం కూడా త‌న‌కు స‌ర్‌ప్రైజేన‌ని ఆమె చెప్పార‌ని పేర్కొన్నారు. ఇక‌, మాధురి ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉన్న‌ట్టు తెలిపారు.