తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో తాజాగా పరకాల నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో 2023లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడ నుంచి రావూరి ప్రకాశ్ రెడ్డి గెలిచారు. ప్రస్తుతం ఆయనే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే గత కొన్నాళ్లుగా ఈ నియోజకవర్గంపై కన్నేసిన మంత్రి కొండా సురేఖ కుటుంబం తాజాగా మరింత దూకుడు ప్రదర్శించింది. పరకాల గడ్డపైనే కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతేకాదు పరకాలను తమ సొంత ఇలాకాగా గట్టిగా పేర్కొన్నారు.
తాజాగా ఇక్కడ జరిగిన కొమ్మాల జాతరకు మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మురళి, కుమార్తె సుస్మితా పటేల్ హాజరయ్యారు. అయితే జాతరకు వచ్చిన వారు కార్యక్రమంతో ముగించకుండా రాజకీయ వ్యాఖ్యలు చేయడంతో పరకాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇది తమ అడ్డా అని, ఇక్కడ నుంచి తామే పోటీ చేస్తామని కొండా మురళి వ్యాఖ్యానించారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచే తాము పోటీలోకి దిగుతామని కూడా తెలిపారు. ఈ క్రమంలో ఆయన కుమార్తె సుస్మిత మరొక అడుగు ముందుకు వేసింది.
తానో ఫైర్ బ్రాండ్ అని వ్యాఖ్యానించిన సుస్మిత, తన తండ్రి జాగ్రత్తగా మాట్లాడాలని సూచించిన నేపథ్యంలో కొంచెం తగ్గి మాట్లాడుతున్నానని చెప్పింది. లేదంటే తానేంటో ఇప్పుడే చూపించేదాన్నని వ్యాఖ్యానించింది. ఇక నుంచి పరకాల నియోజకవర్గంలోనే పర్యటించనున్నట్టు తెలిపింది. “ఇక్కడి సమస్యలు నాకు తెలుసు. ఎవరు ఏం చేస్తున్నారో ఇంకా బాగా తెలుసు” అంటూ సుస్మిత పరోక్షంగా ఎమ్మెల్యే రావూరిని ఉద్దేశించి వ్యాఖ్యానించడం గమనార్హం. పరకాల నుంచే తాను పోటీ చేస్తానని కూడా ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో ఈ టికెట్ తనదేనని ధీమా వ్యక్తం చేసింది.
వాస్తవానికి మంత్రి సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినప్పటికీ తరచుగా పరకాలపై ఈ కుటుంబం దృష్టి పెట్టుతోంది. మరోవైపు గత ఎన్నికల్లో గెలిచిన రావూరి ప్రకాశ్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఆయనకు పార్టీ సీనియర్ల మద్దతు కూడా ఉందని చెబుతున్నారు. అయితే కొండా కుటుంబం దూకుడు కారణంగా పరకాల నియోజకవర్గంలో రాజకీయాలు తరచూ వేడెక్కుతున్నాయి. తాజాగా కుటుంబం మొత్తం పరకాల గడ్డపైనే వ్యాఖ్యలు చేయడం, సుస్మిత తనను తాను ఫైర్ బ్రాండ్‌గా చెప్పుకోవడం, వచ్చే ఎన్నికల్లో టికెట్ తమదేనని మురళి ప్రకటించడం వంటి పరిణామాలు అధికార పార్టీలో పరకాల రాజకీయాలను మరింత వేడెక్కించే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates