ఎంపీ Vs ఎమ్మెల్యే: బాబు జోక్యం అనివార్యం!

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఉర‌ఫ్ చిన్ని-ఇదే నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోకి వ‌చ్చే అసెంబ్లీ నియోజక‌వ‌ర్గం తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావుల మ‌ధ్య వివాదాలు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. గ‌త ఆరు మాసాలుగా ఇరువురు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే స్థాయిలో వివాదాలు కొన‌సాగు తున్నాయి. అయితే.. ఎప్పుడు వివాదం వ‌చ్చినా.. స‌రిదిద్దుతూ.. ఇరువురు నేత‌ల‌ను రాజీ ప‌డేలా చేయాలని టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది.

అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు మార‌తామ‌ని చెబుతున్నా.. ఇరువురు నేత‌ల మ‌ధ్య వివాదాలు.. మ‌న‌స్ఫ‌ర్థ‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా ఎన్టీఆర్ – తెలంగాణలోని ఖ‌మ్మం జిల్లాల స‌రిహ‌ద్దుల్లో ఉన్న నెమ‌లి గ్రామంలో ఉన్న వేణుగోపాల స్వామి ఆల‌యం మ‌రోసారి వీరి వివాదాల‌కు కేంద్రంగా మారింది. ఇక్క‌డ జ‌రిగిన క‌ళ్యాణోత్స‌వం వేదిక‌గా.. ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యేల మ‌ధ్య వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. సోమ‌వారం రాత్రి జ‌రిగిన క‌ల్యాణోత్స‌వంలో ప‌ట్టువ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ తీవ్ర వివాదానికి దారి తీసింది.

నియోజ‌క‌వ‌ర్గం ఎంపీ స్థాయిలో కేశినేని చిన్న దంప‌తులు.. ఈ ఆల‌యం త‌న ప‌రిధిలోనే ఉంటుంద‌ని భావిస్తున్న ఎమ్మెల్యే కొలిక‌పూడి దంప‌తులు కూడా క‌ల్యాణోత్స‌వానికి వ‌చ్చారు. ప‌ట్టువ‌స్త్రాల‌ను అధికారులు ఎంపీకి ఇచ్చారు. అయితే.. ఇలా ఎందుకు ఇస్తార‌ని.. ప్రొటోకాల్ ప్ర‌కారం.. తానే ప్ర‌జాప్ర‌తినిధిన‌ని వాదించిన కొలిక‌పూడి.. ఎంపీ చిన్ని చేతుల్లోని ప‌ట్టు వ‌స్త్రాల‌ను లాగేసుకుని.. త‌న త‌ల‌పై పెట్టుకుని క‌ల్యాణ్ వేదిక వైపు దురుసుగా న‌డుచుకుంటూ వెళ్లారు.

ఈ క్ర‌మంలో ఎంపీ వ‌ర్గం ప్ర‌తిఘ‌ట‌న‌కు దిగింది. ఎమ్మెల్యే త‌ల‌పై పెట్టుకున్న ప‌ట్టువ‌స్త్రాల‌ను లాక్కునే ప్ర‌య‌త్నం చేసింది. అయితే.. ఎంపీ చిన్ని కొంత సంయ‌మ‌నం పాటించారు. అనంత‌రం.. ఇరు ప‌క్షాలు.. క‌ల్యాణ్ వేడుక‌ను వీక్షించాయి. ఈ క్ర‌మంలో ఎంపీ దంప‌తులు.. సాధార‌ణ భ‌క్తుల గ్యాల‌రీలో కూర్చోగా.. వీఐపీ గ్యాలెరీలో ఎమ్మెల్యే దంప‌తులు కూర్చున్నారు.

ఈ వ్య‌వ‌హారం తీవ్ర వివాదానికి దారితీయ‌డంపై సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యారు. ఇరువురిని పిలిచి.. మాట్లాడాల‌ని మ‌రోసారి క్ర‌మ‌శిక్ష‌ణ సంఘానికి సూచించారు. అయితే.. ఇప్ప‌టికే ప‌లుమార్లు చ‌ర్చించామ‌ని.. ఈ సారి సీఎం జోక్యం చేసుకోవాల‌ని క్ర‌మ శిక్ష‌ణ సంఘం నాయ‌కులు చెబుతున్నారు.