ఏపీ సీఎం చంద్రబాబ మనసు చూరగొనాలంటే.. అంత ఈజీకాదు. ఈ విషయాన్ని టీడీపీ నాయకుల నుంచి అధికారుల వరకు అందరూ చెప్పేమాట. ఎంతో కష్టపడాలి. ఆయన అంచనాలను అందుకునేందుకు ఎప్పటికప్పుడు మెదడుకు పదును పెంచుకోవాలి. ఐటీలో మేలిమిగా ముందుకు సాగాలి. ఆయన ఇలా అడిగితే అలా సమాధానం చెప్పే పరిస్థితి ఉండాలి. ఇంత ఉన్నా.. బాబు మనసులో చోటు దక్కు తుందా? అంటే.. బిహేవియర్‌ను కూడా బాబు అంచనా వేసుకుని అప్పుడు అవకాశం కల్పిస్తారు.
ఇలా.. బాబు మనసు మెచ్చిన అధికారి సాయి ప్రసాద్. ఈయన ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తొలిసారే.. సాయిప్రసాద్ ప్రతిభను గమనించారు. అప్పటి నుంచి ఆయనను ప్రోత్సహిస్తున్నారు. తాజాగా శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్ బాధ్యతల స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో పలువురు సాయిప్రసాద్ను అభినందిస్తూ.. బాబు మనసు మెచ్చిన అధికారి అంటూ.. ఆయన ను ప్రశంసలతో ముంచెత్తారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయి ప్రసాద్ శనివారం అమరావతిలోని సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకు సిఎస్ గా పని చేసిన కె.విజయానంద్ శనివారం పదవీ విరమణ చేస్తుండడంతో ఆయన నుండి సాయి ప్రసాద్ సిఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. 1991 ఐఏఎస్ బ్యాచ్ ఎపి క్యాడర్ కు చెందిన సాయి ప్రసాద్ ఎంటెక్ చదివారు. 1992 జూన్ నుండి 1993 మే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వరంగల్ అసిస్టెంట్ కలక్టర్ గా పని చేశారు.
1997 మే నుంచి 1998 ఆగస్టు వరకు కడప జాయింట్ కలక్టర్ గా పనిచేశారు. 2003 అక్టోబరు నుండి 2004 ఆగస్టు వరకు ఎపి ట్రాన్సుకో జెఎండిగా, 2004 ఆగస్టు నుండి 2006 మే వరకు ఇపిడిపిసిఎల్ సిఎండిగా, 2006 మే నుండి 2010 ఫిబ్రవరి వరకు ఎపి సిపిడిసిఎల్ సిఎండిగా పని చేశారు. 2010 ఫిబ్రవరి నుండి 2011 అక్టోబరు వరకు ఎపి హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా పని చేశారు. 2022 ఫిబ్రవరి నుండి 2024 జూన్ వరకు కీలకమైన సీసీఎల్ఏగా పనిచేశారు. ప్రస్తుతం జనవరి జలవరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూనే ముఖ్యమంత్రి ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates