బీజేపీ ఎమ్మెల్సీపై దాడికి యత్నించిన వైసీపీ?

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చిన అనంతరం కూడా అదే అంశంపై మరింత చర్చకు అవకాశం ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు.

అయితే ప్రశ్నోత్తరాల ప్రక్రియ పూర్తయ్యిందని స్పష్టం చేసిన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తదుపరి ప్రశ్నకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు లేచి తన ప్రశ్న అడగడానికి ప్రయత్నించగా, వైసీపీ సభ్యులు ఆయన వైపు దూసుకెళ్లారు.

ఎమ్మెల్సీలు ఇజ్రాయెల్, విక్రాంత్, రమేశ్ యాదవ్ తదితరులు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. తాము నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో మైక్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సోము వీర్రాజుపై దాడికి యత్నించారు.

సోము వీర్రాజుకు మద్దతుగా హోంమంత్రి అనితతో పాటు మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరియు ఇతర టీడీపీ సభ్యులు ముందుకు వచ్చి ఆయనను అడ్డుగా నిలిచారు. రెండు వర్గాల సభ్యులు ఎదురెదురుగా నిలవడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపు తప్పేలా మారడంతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.

సభలో జరిగిన ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వైసీపీ సభ్యుల ప్రవర్తనపై బీజేపీ, టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా, సభలో క్రమశిక్షణ పాటించాలని పలువురు కోరారు. మరోవైపు, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదనే కారణంతోవైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు.