వెసీపీలో నెక్ట్స్ వికెట్ ఫిక్స్ చేసిన కూట‌మి… !

వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి వంతు వ‌చ్చిందా? ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డం ఖాయ‌మా? అంటే.. తాజా ప‌రిణామాలు ఔన‌నే స‌మాధానం ఇస్తున్నాయి. రాజ‌ధాని అమరావతి ప‌రిధిలో నిర్మిస్తున్న‌ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు భూముల కేసులో సీఐడీ అధికారులు ఆళ్ల రామకృష్ణారెడ్డికి తాజాగా నోటీసులు ఇచ్చారు. రింగ్ రోడ్డు విస్త‌ర‌ణ‌లో ఉద్దేశ‌పూర్వ‌కంగా కుట్ర‌కు పాల్ప‌డ్డారంటూ.. గ‌తంలో ఆళ్ల నానా యాగీ చేశారు.

దీంతో వైసీపీ హ‌యాంలో సీఎం చంద్ర‌బాబు స‌హా.. పలువురు నేత‌ల‌పై అప్ప‌టి సీఐడీ అధికారులు కేసులు న‌మోదు చేశారు. ముఖ్యంగా చంద్ర‌బాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ‌కు మేలు జ‌రిగేలా ఐ ఆర్ ఆర్ లో మార్పులు చేశార‌ని.. దీనివ‌ల్ల కోట్ల రూపాయ‌ల ప్ర‌జా ధ‌నం వృథా అవుతోంద‌ని ఆళ్ల ఆరోపించారు. అంతేకాదు.. ఉద్దేశ‌పూర్వ‌కంగానే అవ‌స‌రం లేకున్నా ఇన్న‌ర్ రింగ్ రోడ్డు అలైన్ మెంటులో మార్పులు చేశార‌ని పేర్కొన్నారు.

అయితే.. ఈ కేసును విచారించిన విజ‌య‌వాడ‌లోని ఏసీబీ కోర్టులో.. సీఐడీ అధికారులు.. ఇటీవ‌ల మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ జ‌రిగింద‌ని పేర్కొంటూ అఫిడ‌విట్ ఇచ్చారు. దీనిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న కోర్టు కేసును మూసేసేందుకు రెడీ అయింది. ఈ నేప‌థ్యంలో ఆళ్ల అస‌లు ఏ ఆధారాల‌తో ఈ ఫిర్యాదు చేశారు..? అనే కోణంలో సీఐడీ అధికారులు ఇప్పుడు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. దీనిలో భాగంగానే ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చారు. గ‌తంలో రాజ‌ధానికి రుణాలు ఇవ్వ‌ద్దంటూ ప్ర‌పంచ‌బ్యాంకుకు ఆళ్ల లేఖ‌లు రాసిన విష‌యం తెలిసిందే.

ఇప్పుడు ఆ వ్య‌వ‌హారంపై కూడా కేసులున‌మోదు చేసిన‌ట్టు తెలిసింది. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై విచార‌ణకు హాజ‌రు కావాల‌ని కోరుతూ.. సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే.. ఈ విచార‌ణ‌లో భాగంగానే ఆయ‌న‌ను అరెస్టు చేయొచ్చ‌ని సీఐడీ చెబుతోంది.

“మాకు ఉన్న స‌మాచారం మేర‌కు ఆయ‌న‌ను విచారించాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ఆయ‌న ఇచ్చే స‌మాధానాల ఆధారంగాచ‌ర్య‌లు తీసుకుంటాం“ అని సీఐడీ అధికారి ఒక‌రు చెప్పారు. దీనిని బ‌ట్టి ఆళ్ల అరెస్టు ఖాయ‌మ‌ని తెలుస్తోంది.