జనసేన పార్టీలో సభ్యత్వ నమోదు విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఏడాది పార్టీ సభ్యత్వాలను జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రారంభించారు. తొలి సభ్యత్వం తనే తీసుకుని పార్టీకి 2 కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. అనంతరం పలువురు నాయకులు కూడా స్పందించి.. సభ్యత్వాలు తీసుకున్నారు.
ఇక, సోమవారం ఈ విషయంపై ఎవరూ స్పందించలేదు. సహజంగా సభ్యత్వ నమోదు అనగానే పార్టీల్లో ప్రత్యేక హడావుడి కనిపిస్తుంది. గతంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించగానే.. నగరాల్లో ప్రత్యేక టెంట్లు వేసుకుని టార్గెట్ పూర్తి చేసేందుకు ప్రయత్నించారు. ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా నాయకులు సభ్యత్వ నమోదు విషయంలో పోటీ పడ్డారు. కానీ.. ఇప్పుడు మాత్రం ఆ తరహా దూకుడు కనిపించలేదు.
ఈ విషయంపైనే కొందరు మీడియా మిత్రులు జనసేన నాయకులను పలకరించినప్పుడు.. చిత్రమైన సమాధానం వచ్చింది. సభ్యత్వం జరుగుతుంది.. అని కొందరు వ్యాఖ్యానిస్తే.. తమకుఎలాంటి టార్గెట్లు విధించలేదని మరికొందరు చెప్పారు. అంటే.. పార్టీ అధిష్టానం నాయకులకు.. సభ్యత్వం విషయంలో ఎలాంటి టార్గెట్లు విధించలేదని తెలుస్తోంది. కానీ, వాస్తవానికి ఏ పార్టీ అయినా.. లక్ష్యం నిర్దేశం చేస్తుంది. నగరాలు, పట్టణాల పరిధిలో ఎక్కువగా సభ్యత్వం రావాలని కోరుతుంది.
గతంలోనూ జనసేనలో ఇలానే లక్ష్యాలు నిర్దేశించారు. కానీ, ఈ సారి మాత్రం దీనికి భిన్నంగా పార్టీ లక్ష్యాలు నిర్దేశించిలేదని నాయకులే చెబుతున్నారు. దీంతో ఎవరికి వారు తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం పార్టీల సభ్యత్వాల్లో టీడీపీ ముందుంది. తర్వాత.. స్థానంలో వైసీపీ ఉంది. దీనిని అధిగమించి.. ముందుకు సాగాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. కానీ, తమకు ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించలేదని చెబుతున్న జనసేన నాయకులు మౌనంగా ఉంటున్నారు. మరి దీనిపై సరైన దిశానిర్దేశం చేస్తారో.. లేక ఇలానే ఉంటారో చూడాలి. ప్రస్తుతానికి అయితే.. సభ్యత్వ నమోదు వ్యవహారం.. ఎక్కడా కనిపించడం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates