విమర్శకుల ప్రశంసలు అందుకున్న డిప్యూటీ సీఎం!

సింగరేణి బొగ్గు టెండర్ల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతల మధ్య విభేదాలు వచ్చాయని మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల మధ్య విభేదాలు రచ్చకెక్కాయని ప్రచారం జరిగింది.

అయితే, ఆ ప్రచారం సంగతి పక్కనబెడితే..రాజకీయాలకు అతీతంగా భట్టి విక్రమార్క చేసిన పని విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. మహా శివరాత్రి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితోపాటు కేబినెట్ మంత్రుల పేర్లతో భట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన వైనం హాట్ టాపిక్ గా మారింది.

శివరాత్రి సందర్భంగా ఖమ్మం జిల్లా మధిరలోని గంగా పార్వతీ సమేత మృత్యుంజయ స్వామి గర్భాలయంలో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క సతీసమేతంగా ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఆ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రుల పేరిట భట్టి దంప‌తులు గోత్ర నామాలతో అర్చన చేయించడం విశేషం.

రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ తదితరుల పేర్లతో భట్టి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి సుభిక్షంగా ఎదగాలని, ప్రతి కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడాలని భట్టి ఆంకాంక్షించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని పరమశివుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

ప్రస్తుతం భట్టి ప్రత్యేక పూజలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన సహచర మంత్రుల పేరుపేరున పూజలు నిర్వహించిన భట్టి విక్రమార్కపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విమర్శకులు సైతం భట్టిని ప్రశంసిస్తున్నారు.