ఏపీ సీఎం జగన్‌కు కేంద్రంలోని పెద్దలు సహకరిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదని ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమచారం. అదేసమయంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కూడా దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. కీలకమైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ నుంచి అనేక విషయాల్లో జగన్‌కు అనుకూల పరిణామాలు జరుగుతుండడాన్ని బట్టి.. కేంద్రం సంపూర్ణంగా సహకరిస్తోందనే వాదనకు బలం చేకూరుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా రుణాలు తెచ్చుకునేందుకు(పరిమితికి మించి) కూడా కేంద్రం ఓకే చెప్పింది. అదేవిధంగా ప్రాజెక్టుల విషయంలోనూ అనుమతులకు సహకరిస్తోంది.
అయితే.. ఇంత చేస్తున్నా.. ఓ కీలక విషయంలో మాత్రం జగన్ ఆశలు నెరవేరే పరిస్థితి కనిపించడం లేదన్నది ఢిల్లీ వర్గాల మాట. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో అంచనాల పెంపునకు కేంద్రం ససేమిరా అంటోంది. 2014లో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 27 వేల కోట్లుగా అప్పట్లో అంచనా వేశారు. తర్వాత దానిని 38 వేల కోట్లకు, ఆ తర్వాత 43 వేల కోట్లకు.. తుదిగా అంటే.. 2018లో 56 వేల కోట్లకు పెంచారు. ఈ విషయంలో చివరిగా రూపొందించిన అంచనా వ్యయానికి పచ్చ జెండా ఊపాలనేది జగన్ డిమాండ్. అయితే.. ఈ విషయంలో కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేయలేక పోతున్నారు. తనపై ఉన్న సీబీఐ కేసులు కావొచ్చు.. లేదా మరే ఇతర కారణాలు కావొచ్చు.
ఇటీవల ఢిల్లీ పర్యటనలోనూ ప్రధాన అజెండా పోలవరం అంచనాలకు ఆమోద ముద్ర వేయించుకోవడమేననే విషయం తెలిసిందే. పైకి చాలా గంభీరంగా తుది అంచనాలకు కేంద్రం సానుకూలంగా ఉందని ప్రచారం చేసుకుంటున్నా.. తాజాగా ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్న కథనాల మేరకు.. ప్రధాని మోడీ.. ఈ ఒక్క విషయంలో ఎట్టి పరిస్థితిలోనూ సహకరించే అవకాశం లేదని తెలుస్తోంది. బహుశ ఈ క్రమంలోనే ఆయన ఇటీవల జగన్ పర్యటనలో అప్పాయింట్‌మెంట్ ఇవ్వలేదని అంటున్నారు. అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ముఖం చాటేయడానికి ఈ ఒక్కటే కారణంగా కనిపిస్తోంది.
కానీ, రాష్ట్రంలో రాజకీయంగా పుంజుకునేందుకు జగన్‌కు ఉన్న ఏకైక మార్గం పొలవరం పూర్తి చేయడం. మూడు రాజధానులు ఎలాగూ .. ముడిపడే పరిస్థితి కనిపించడం లేదు. సో.. పోలవరాన్నయినా.. పూర్తి చేసి.. వచ్చే ఎన్నికల నాటికి ప్రజల ముందుకు వెళ్లాలని ఆయన వ్యూహంగా పెట్టుకున్నారు. కానీ, దీనికి మోడీ మాత్రం ఆ ఒక్కటి తప్ప! అనే డైలాగును వల్లెవేస్తున్నారు. ఫలితంగా జగన్‌కు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చందంగా పరిస్థితి మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి.