‘బాబ్రీ’ మసీదు పనులు ప్రారంభం

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లా బెల్దంగా కేంద్రంగా మరోసారి బాబ్రీ అంశం రాజకీయ చర్చలకు దారితీసింది. జనతా ఉన్నాయన్‌ పార్టీ అధ్యక్షుడు హుమాయున్‌ కబీర్‌ బుధవారం ఖురాన్‌ పఠనం అనంతరం మసీదు నిర్మాణ పనులను ప్రారంభించినట్టు ప్రకటించారు.

అయోధ్యలో కూల్చివేయబడిన నిర్మాణ నమూనాను ఆదర్శంగా తీసుకుని మసీదు నిర్మిస్తామని, రెండేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. “అల్లాహ్‌ కృపతో మా బాబ్రీ మసీదు నిర్మాణం పూర్తి అవుతుంది” అని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

మాజీ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్న కబీర్‌ ఇటీవలే కొత్త పార్టీ స్థాపించి ఈ ప్రకటన చేయడం విశేషంగా మారింది. ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ ఈ నిర్ణయం రాజకీయ వ్యూహంలో భాగమేనా? ముఖ్యంగా ముస్లిం ఓటు బ్యాంకుపై ప్రభావం చూపే ప్రయత్నమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు ఇది దారి తీస్తుందా అన్నదీ ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉండగా, బాబ్రీ మసీదు అంశం ముగిసిన అధ్యాయమని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పష్టం చేశారు. మసీదును మళ్లీ నిర్మిస్తామనే కలలు నెరవేరవని వ్యాఖ్యానించారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణం అనంతరం దేశంలో శాంతి, సామరస్యాలు కాపాడాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ పరిణామాలతో బాబ్రీ అంశం మరోసారి జాతీయ రాజకీయాల్లో వేడి చర్చలకు దారి తీసింది.