తిరుపతిలో పారని బీజేపీ పాచిక

దుబ్బాక ఉపఎన్నికలో అయినా గ్రేటర్ ఎన్నికలో అయినా బీజేపీకి ప్రధాన ఆయుధం భావోద్వేగాన్ని రెచ్చగొట్టడం. తనకు అలవాటైన పాచికను విసరటం ద్వారా రెండు ఎన్నికల్లోను కమలంపార్టీ నేతలు సక్సెస్ అయ్యారు. దుబ్బాకలో కన్నా గ్రేటర్ ఎన్నికల్లో ఈ పాచిక పర్ఫెక్టుగా సెట్టయ్యింది. ఎలాగంటే గ్రేటర్లోనే ఓల్డ్ సిటి ఉండటం, అక్కడ ముస్లింల ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉందని అందరికీ తెలుసు. ముస్లింలకు ఏకైక ప్రతినిధిగా ఎంఐఎం దశాబ్దాల తరబడి వ్యవహరిస్తోంది. ఇటువంటి ఎంఐఎంతో అధికార టీఆర్ఎస్ కు బలమైన దోస్తానా కూడా ఉంది.

అందుకనే ఒకేసారి బీజేపీ నేతలు ఇటు ఎంఐఎంతో పాటు అటు టీఆర్ఎస్ ను టార్గెట్ చేయగలిగారు. వీళ్ళ టార్గెట్ కు రెండుపార్టీల అగ్రనేతలు దొరికిపోయారు. ఆ విధంగా రెండుపార్టీల నేతలను ట్రాపులో ఇరికించుకుని బీజేపీ మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి లాభపడింది. కాబట్టి అదే పాచికను తిరుపతి ఉపఎన్నికలో కూడా విసరటానికి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రయత్నించారు. అయితే బీజేపీ ట్రాపులో ఇటు అధికార వైసీపీతో పాటు అటు ప్రతిపక్షాల్లో ఏ ఒక్కపార్టీ కూడా పడలేదు.

తిరుపతిలో జరిగిన రెండు రోజుల కార్యవర్గ సమావేశాల్లో హిందువుల ఓట్లని, ముస్లింల దర్గాలని, క్రిస్తియనన్ల చర్చిలను కమలంపార్టీ నేతలు ఏవోవో మాట్లాడారు. అయితే వైసీపీ నేతల నుండి ఒక్క స్పందన కూడా కనబడలేదు. బీజేపీ ఆరోపణలు చేసింది జగన్మోహన్ రెడ్డి మీద కాబట్టి సహజంగానే ప్రతిపక్షాలన్నీ రెస్పాండ్ కాలేదు. దాంతో బీజేపీ ఆరోపణలన్నీ వన్ సైడు అయిపోయింది. ఇదే సమయంలో జనాలు కూడా పట్టించుకోకపోవటంతో ఇక ఆ సబ్జెక్టును వదిలిపెట్టేసింది.

నిజానికి తిరుపతి అంటేనే విద్యావంతులు ఎక్కువగా ఉండే పట్టణం అని అందరికీ తెలిసిందే. నాలుగు విశ్వవిద్యాలయాలు, వందలాది కాలేజీలు, స్కూళ్ళున్న పట్టణం. కాబట్టి సహజంగానే మతపరమైన భావోద్వేగాలు పెద్దగా పనిచేయవు. గుళ్ళు, చర్చీలు, మసీదులకు వెళ్ళే జనాలంతా కలిసి మెలసే ఉంటారు. కాబట్టే మతపరమైన సమస్యలు తిరుపతిలో ఎప్పుడు తలెత్తలేదు.

ఇటువంటి చోట బీజేపీ ముందు వెనకా ఆలోచించకుండా జనాల్లో భావేద్వేగాలను రెచ్చగొడదామని ప్రయత్నించి భంగపడింది. పైగా 2014 ఎన్నికల్లో తమను గెలిపిస్తే రాష్ట్రంలో తాము చేయబోయే అభివృద్ధి ఏమిటో అప్పట్లో నరేంద్రమోడి చేసిన హామీలు ఇంకా జనాలకు గుర్తుంది. కాబట్టి తెలంగాణాలో పారినట్లుగా బీజేపీ పాచిక ఏపిలో పారదని కమలనాదులు గ్రహించాలి. ‘పిడుక్కు బియ్యానికి ఒకే మంత్రం’ అన్నట్లుగా ఉంది బీజేపీ నేతల యవ్వారం. కాబట్టి ముందు ఆ విషయం గ్రహించి స్ట్రాటజీని మార్చుకోవాల్సిందే.