వైసీపీ నేతలు, ఆ పార్టీ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా రెండు విషయాలను ఆయన ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు రాజకీయ నినాదాలు చేయడాన్ని తప్పుబట్టారు. అంతేకాదు.. సభలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నించారని కూడా వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీరియస్‌గా తీసుకోవాల న్నారు.
ఇక, మతాన్ని సైతం.. రాజకీయంగా వాడుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని పవన్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఎంతకైనా తెగించేందుకు సాహసిస్తారని చెప్పిన పవన్.. అధికార కూటమి పార్టీలు, ఆయా పార్టీల నాయకులు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అనంతరం.. సభను వాయిదా వేశారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్.. సీఎం చంద్రబాబు సహా భేటీ అయ్యారు.
సభలో వ్యవహరించాల్సిన విధానం.. ఏయే అంశాలను లేవనెత్తాలి? అనే విషయాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో రచ్చ చేసేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా ఎదురు దాడి చేసే అవకాశం ఉందన్నారు.
ముఖ్యంగా తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసింది కాక.. దీనిని తమ రాజకీయాలకు అనుగుణంగా వినియోగించుకునే అవకాశం ఉందని పవన్ హెచ్చరించారు. ఈ క్రమంలో కూటమి పార్టీల మధ్య సఖ్యత ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఏ విషయంలో అయినా.. కలసి కట్టుగా ఎదుర్కొనేందుకు.. రాజకీయంగా ఉమ్మడిగా నిలబడేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates