ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ నెల 14న 2026-27 వార్షిక బడ్జెట్‌ను కూడా సభలో ప్రవేశ పెట్టనున్నారు. అయితే.. ఈ సభకు హాజరయ్యే వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా.. సోమవారం ప్రత్యేక వార్త చక్కర్లు కొట్టింది. సభ తొలిరోజు గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలోఆయన ప్రసంగానికి హాజరు కావాలని నిర్ణయించినట్టు వైసీపీ కార్యాలయం తెలిపినట్టు వైసీపీ వర్గాలు వెల్లడించాయి.
వాస్తవానికి గవర్నర్ హాజరయ్యే రోజు సభకు రావడం ద్వారా రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించడంతోపాటు.. రాజకీయ దుమారానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. సభలో ఎలాంటి విమర్శలు ఎదుర్కొనకుండా.. వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు అవకాశం ఉంటుంది. అందుకే.. గతంలోనూ 2025-26 వార్షిక బడ్జెట్ సమయంలో వైసీపీ తొలిరోజు సభకు వచ్చింది. ఆ తర్వాత.. మళ్లీ సభమొహం కూడా చూడలేదు. ఇప్పుడు కూడా ఇదే ఆలోచన చేసినట్టు తెలిసింది.
అయితే.. ఇది సోమవారం వరకు ఉన్న అంచనా. కానీ, మంగళవారం ఉదయానికి వైసీపీ వ్యూహం మార్చేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత అసెంబ్లీలో పూర్తి రోజులు హాజరు కావాలని.. నిర్ణయించినట్టు పార్టీ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు ఆఫ్ ది రికార్డుగా తెలిపారు. దీనికి ప్రధానంగా మూడు కారణాలను ఆయన పేర్కొనడం గమనార్హం. 1) సభలో ఎలానూ లడ్డూ ప్రసాదంపై చర్చ జరగనుంది. దీనిని బలంగా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది.
2) సభ జరిగినన్ని రోజులు కూడా.. ఉదయం వెళ్లి.. రెండు మూడు నిమిషాల పాటు ఆందోళన చేసి.. సభ నుంచి సస్పెండ్ అయితే.. చాలన్న వ్యూహం మరొకటి ఉన్నట్టు తెలుస్తోంది. 3) ఇప్పటి వరకు సభకు రాకుండానే వేతనాలు తీసుకుంటున్నారన్న వాదన వినిపిస్తున్న నేపథ్యంలో దీనికి చెక్ పెట్టాలని.. తాము సభకు రావడం ద్వారా.. ఈ వాదన లేకుండా చేయాలన్న వ్యూహం ఉంది. అంటే.. మొత్తంగా సభ జరిగినన్ని రోజులు జగన్ వచ్చినా.. రాకపోయినా.. ఇతర ఎమ్మెల్యేలను పంపించాలని తద్వారా.. బ్యాడ్ మార్కును తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates