సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన సంకల్పయాత్ర అలిపిరికి చేరుకుంది. మెట్ల మార్గంలో ఆయన శ్రీవారి సన్నిధికి బయలుదేరారు. జనవరి 19న హైదరాబాద్‌లోని షాద్‌నగర్ నివాసం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర సుమారు 507 కిలోమీటర్లు సాగి సోమవారం తిరుపతికి చేరింది.
మార్గమధ్యంలో పలుచోట్ల అభిమానులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు కలిసి ఆయనకు మద్దతుగా నడిచారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న అభిమానంతోనే ఈ సంకల్పయాత్ర చేపట్టినట్లు బండ్ల గణేశ్ వెల్లడించారు.
గతంలో స్కిల్ కేసు సమయంలో చంద్రబాబు అరెస్టు కావడంతో తీవ్రంగా కలత చెందినట్లు పేర్కొన్నారు. “ఆయన సురక్షితంగా బయటకు వస్తే కాలినడకన శ్రీవారి దర్శనానికి వస్తాను” అని అప్పుడే మొక్కుకున్నానని చెప్పారు. ఆ సంకల్పం నెరవేరినందున ఇప్పుడు పాదయాత్ర పూర్తి చేశానని తెలిపారు.
ఈ యాత్రకు రాజకీయ సంబంధం లేదని, ఇది పూర్తిగా భక్తి భావంతో చేసినదేనని బండ్ల గణేష్ తన పాదయాత్ర మొదలైన సందర్భంలో స్పష్టం చేశారు..తిరుపతికి చేరుకోగానే “నా గడప నుంచి వెంకన్న గడప వరకూ నడిచి వస్తానని ప్రార్థించాను. ఆ ఏడుకొండల వాడి కృపతో నా సంకల్పం నెరవేరింది” అని బండ్ల గణేశ్ భావోద్వేగంగా తెలిపారు.
పాదయాత్ర చేస్తున్న బండ్ల గణేష్ను 15 రోజుల కిందట మంత్రి నారా లోకేష్ ఫోన్లో పరామర్శించారు. కాలినొప్పితో బాధపడుతున్నారని తెలిసి పాదయాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కాలినొప్పి నుంచి త్వరగా కోలుకుని, మొక్కు చెల్లించుకోవాలని ఆకాంక్షించారు. గణేష్ శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనను కలిసే అవకాశం ఉందని సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates