మొన్న అంబటి.. నేడు జోగి తప్పేం లేదంటోన్న జగన్

ఒక పార్టీకి అధినేత అయిన వ్యక్తి తన పార్టీకి చెందిన నేతలను కాపాడుకోవాలనుకోవడంలో ఎటువంటి తప్పూ లేదు. కానీ, ఆ పార్టీలోని కొందరు నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమయంలో అయిన ఆ నేతల తీరును తప్పుబట్టాలి. పోనీ, ఆ నేతలు ఫీల్ అవుతారు అనుకుంటే కనీసం వారి కామెంట్ల గురించి మాట్లాడకుండా దాటవేత ధోరణి అవలంబించాలి.

అంతేగానీ, ఆల్రెడీ కాంట్రవర్షియల్ అయిన కామెంట్లను మాజీ ముఖ్యమంత్రి స్థాయి స్థానంలో ఉన్న వ్యక్తి సమర్థిస్తే ఆ పార్టీలో మొత్తం నేతలంతా ఇదే టైపు అని జనం ముద్ర వేస్తారు. వైసీపీ అధినేత జగన్ తాజాగా ఆ రీతిలో చేసిన వ్యాఖ్యలతో వైసీపీపై ప్రజలు బూతుల పార్టీ అని ముద్ర వేసినా ఆశ్చర్యం లేదు.

లోకేశ్ కు కొవ్వు తగ్గలేదు, లోకేశ్ మెదడులో చిప్ దొబ్బింది అంటూ జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలను జగన్ నిస్సందేహంగా సమర్థించిన వైనం హాట్ టాపిక్ గా మారింది. మొన్న అంబటి రాంబాబు వ్యాఖ్యలను సమర్థించిన జగన్ నేడు జోగి రమేశ్ ను వెనకేసుకు వచ్చిన వైనం చర్చనీయాంశమైంది.

అంతేకాదు, జోగి రమేశ్ వ్యాఖ్యలపై ఇంకో అడుగు ముందుకు వేసిన జగన్…చంద్రబాబు, లోకేశ్, పవన్ ల చిప్ రిపేర్ చేయాలని వైసీపీ నేతలు ఆలయాల్లో పూజలు కూడా చేశారని వ్యాఖ్యానించి తమ పార్టీలోని నేతలంతా ఇంతే మాట్లాడతారు అని సభ్య సమాజానికి గట్టి సందేశం ఇచ్చినట్లయింది.

జోగి రమేశ్ చేసిన తప్పేమీ లేదని జగన్ అన్నారు. చంద్రబాబు, లోకేశ్, వాళ్లందరినీ ప్రశ్నిస్తూ చిప్ రిపేర్ చేసుకోండి అని మాత్రమే అన్నాడని సమర్థించారు. ఇంత అన్యాయమైన పని చేస్తున్నారు..ఇది ధర్మమేనా అని అడిగాడని, అంతకన్నా చేసిందేమీ లేదని జోగి రమేశ్ వివాదాస్పద వ్యాఖ్యలను జగన్ వెనకేసుకొచ్చారు.

అంతమాత్రానికే యాసిడ్ బాటిల్స్, పెట్రోల్ బాంబులతో జోగి రమేశ్ ఇంటిపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దాడి సమయంలో 80 ఏళ్ల వయసున్న జోగి రమేశ్ తండ్రి ఇంట్లో ఉన్నారని, ఆ బాంబుల ధాటికి ఇంటికి నిప్పంటుకొని ఉంటే ఆయన పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇది హత్యాయత్నం కాదా అని జగన్ నిలదీశారు.