‘ఏపీలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు లాగా జగన్ “కల్తీ రిక్రూట్‌మెంట్ బోర్డు” అనే వ్యవస్థను స్థాపించారు. దానికి ఆయనే అధ్యక్షుడిగా వ్యవహరించారని’ అంటూ ప్రస్తుత హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. ఇంతకీ ఆమె చెప్పిన అధ్యక్షుడు ఎవరో తెలుసా? ఇంకెవరు.. వైయస్ జగన్.
తిరుమలలో కల్తీ వ్యవహారం లో సిట్ నివేదికను ఆధారం చేసుకుని వైసిపి తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్న సమయంలో కూటమి ప్రభుత్వ నేతలు వారికి ధీటుగా సమాధానం ఇస్తున్నారు.
ఈ క్రమంలో హోం మంత్రి అనిత ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. గత ఐదేళ్ల జగన్ మోహన్ రెడ్డి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పీడకలని, అడుగడుగునా కల్తీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని హోం మంత్రి విమర్శించారు.
అంతా కల్తీ మయం..
కోవిడ్ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న జనాభాకు కల్తీ మందులు సరఫరా చేయడంతో మొదలై.. కల్తీ లిక్కర్, చివరకు సామాన్య ఇసుకలో సముద్రపు ఇసుక కలిపి విక్రయించే స్థాయికి జగన్ పాలన దిగజారి పోయిందన్నారు. చివరకు విద్యా వ్యవస్థను, పరీక్షా విధానాలను కూడా కల్తీ చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారని ఆరోపించారు.
ఆ మనిషే ఒక కల్తీ, ఆయన పాలనే ఒక కల్తీ అని మండిపడ్డారు. కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ అయిన తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిని కల్తీ చేయడం ద్వారా జగన్ ప్రభుత్వం మహా పాపానికి ఒడిగట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ చెప్పింది అంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, అసలు కల్తీ జరగలేదని నిరూపించడానికి వైసీపీ దగ్గర ఒక్కటంటే ఒక్క అథెంటిక్ రిపోర్ట్ ఉందా? అని ఆమె ప్రశ్నించారు.
హిందూ ధర్మంలో తిరుమల ప్రసాదానికి ఉన్న పవిత్రత జగన్ మోహన్ రెడ్డికి తెలియదన్నారు. పవిత్రమైన ప్రసాదంలో బాత్రూమ్ క్లీనర్లకు వాడే లబ్సా వంటి కెమికల్స్‌ను, పామాయిల్‌ను, జంతువుల కొవ్వును కలిపి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తారా? అని అనిత మండిపడ్డారు. జగన్ కి హైందవ సంప్రదాయం గురించి తెలియదు కాబట్టే అయోధ్య రామాలయానికి కూడా కల్తీ లడ్డూలు పంపి మహాపచారానికి ఒడిగట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
