జగన్ పర్యటనలో అపశృతి.. కుప్పకూలిన కార్యకర్త

వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పరామర్శ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్‌ను పరామర్శించేందుకు తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లిన సందర్భంగా, ఆయనను చూసేందుకు భారీగా చేరుకున్న కార్యకర్తల్లో ఒకరు గుండెపోటుతో మృతి చెందారు.

జగ్గయ్యపేట నియోజకవర్గంలోని చిల్లకల్లు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త డి. రాంబాబు (45) జోగి రమేష్ నివాస సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

జగన్ పర్యటన సందర్భంగా జనసందోహం పెరగడంతో ఇబ్రహీంపట్నం రింగురోడ్ పరిసరాల్లో కొందరు యువకులు బైకులతో స్టంట్లు చేస్తూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో బైక్‌పై స్టంట్ చేస్తూ రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడును ఢీకొని ఓ యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనను పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. 

కొద్ది నెలల కిందట వైయస్ జగన్ చేపట్టిన సత్తెనపల్లి పర్యటనలోనూ ఇటువంటి ఘటనే జరిగింది. జగన్ కాన్వాయ్ లోని ఒక వాహనం వృద్ధుడు మృతి చెందాడు. జగన్ పర్యటనలో భారీగా జన సమీకరణ చేయడం, కార్యకర్తలు హల్చల్ చేయడం పరిపాటిగా మారింది.

ఈ క్రమంలోనే కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కేవలం గంటలో ప్రయాణించే దూరాన్ని దాదాపు 6 గంటల పాటు దీర్ఘంగా సాగదీయడం, జనాల్ని తరలించడం వంటివి చేస్తున్నారని, ఆ కారణంగానే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని టిడిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు.