కాపులపై ‘అంబటి’ సెంటిమెంట్ ఎంత?

అంబటి రాంబాబును అడ్డు పెట్టుకుని కాపులను మరోసారి వైసీపీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా? కుల రాజకీయాలు, కాపు రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తోందా? అంటే మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి ఆరోపించారు కాబట్టి ఔననే అనాలా? లేక ప్రస్తుత, గత పరిణామాలను అంచనా వేస్తే కాదని అనాలా? అనేది ప్రశ్న. ఎందుకంటే క్రాంతి అనుకుంటున్నట్టుగా కాపులను అంతగా ప్రభావితం చేసే శక్తి అంబటికి లేదనే వాదన బలంగా వినిపిస్తోంది.

ఒకప్పుడు అంబటికి కొంత గౌరవం ఉండేది. కానీ తరువాత పదేపదే పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయడం, గంటల తరబడి వ్యాఖ్యలు చేయడం వంటివి కాపుల్లో ఆయన ఇమేజ్‌ను గణనీయంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా పవన్‌కు సవాళ్లు విసిరిన తీరు కాపులలో చాలా మందికి నచ్చలేదనే అభిప్రాయం ఉంది. అందుకే ఇటీవల ఆయన చుట్టూ వివాదం చెలరేగినా, ఇంటిపై దాడి జరిగినా, అరెస్టు చేసి జైలుకు తరలించినా కాపు వర్గాల్లో పెద్దగా అలజడి కనిపించలేదని చెబుతున్నారు.

అంతేకాదు, కాపు నాయకులు లేదా మేధావులు పెద్దగా స్పందించకపోవడం గమనార్హం. ముద్రగడ పద్మనాభం మాత్రమే స్పందించారు. అయితే ఆయన లేఖలు, వ్యాఖ్యలను కూడా కాపులు గతంలా పట్టించుకోవడం లేదనే వాదన ఉంది. ఎందుకంటే ఆయన న్యూట్రల్ రాజకీయాలు చేసినంత వరకు, కాపుల కోసం ఉద్యమించినంత వరకు ఆదరణ లభించింది. కానీ వైసీపీకి అనుకూలంగా మారిన తర్వాత ఆయన ప్రభావం తగ్గిందని అంటున్నారు.

ఈ పరిణామాలను పరిశీలిస్తే అంబటి ఎపిసోడ్ కాపులను గణనీయంగా ప్రభావితం చేసినట్టు ఆధారాలు కనిపించడం లేదు. వివాదాస్పద వ్యాఖ్యలు, ముఖ్యంగా సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలే ఆయనకు నష్టం చేశాయని విశ్లేషకులు చెబుతున్నారు.

మొత్తంగా చూస్తే క్రాంతి వ్యక్తం చేసిన ఆవేదనకు పెద్ద రాజకీయ ప్రభావం కనిపించడం లేదని, అంబటి చుట్టూ కాపు సెంటిమెంట్ పెరుగుతుందన్న వాదనకు బలమైన ఆధారాలు లేవని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.