నా మెడ కోసేశారు: కాంగ్రెస్ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ నా మాట‌కు విలువ లేకుండా పోయింది. నేను ఏమొహం పెట్టుకుని తిర‌గాలి. పార్టీ పెద్ద‌లు.. నా మెడ కోసేశారు“ అని జీవ‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు స్థానికంగా తీవ్ర సంచ‌ల‌నం సృష్టించాయి. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 116 మునిసిపాలిటీలు 7 కార్పొరేష‌న్ల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.

ఈ క్ర‌మంలో స్థానిక ఎన్నిక‌ల్లో ఎవ‌రికి టికెట్లు ఇవ్వాల‌న్న అంశంపై సీనియ‌ర్లయిన‌.. మంత్రుల‌కు బాధ్య‌తలు అప్ప‌గించారు. ఇది చాలా చోట్ల వివాదాల‌కు దారి తీస్తోంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వ‌చ్చి.. కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్న ఎమ్మెల్యేలు, ఇత‌ర నాయుకులు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు జిల్లాల్లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టికెట్ల వ్య‌వ‌హారం మ‌రింత కాక రేపుతోంది. ఇలా.. జ‌గిత్యాల‌లో తీవ్ర ర‌గ‌డ తెర‌చాటున చోటు చేసుకుంది. ఇప్పుడు అదే బ‌య‌ట ప‌డింది.

జ‌గిత్యాల నుంచి గ‌త 2023లో బీఆర్ ఎస్ నాయ‌కుడు సంజ‌య్ విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర్వాత‌.. ఆయ‌న కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ చేరిక‌ను అప్ప‌ట్లోనే జీవ‌న్ రెడ్డి విభేదించారు. తీవ్ర‌స్థాయిలో నిర‌స‌న వ్య‌క్తం చేశారు. అయినా.. పార్టీ పెద్ద‌లు ఆయ‌న‌ను స‌ముదాయించారు. ఇక‌, ఇప్పుడు స్థానిక స‌మ‌రంలోనూ సంజ‌య్‌దే ప్ర‌ధాన భాగ‌స్వామ్యం కావ‌డం.. త‌న వారికి టికెట్ల‌ను త‌గ్గించ‌డం ప‌ట్ల జీవ‌న్ రెడ్డి తీవ్ర అసం తృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు.

తాజా ఎన్నిక‌ల్లో జ‌గిత్యాల మునిసిపాలిటీలో 50 వార్డులు ఉన్నాయి. వీటిలో 30 వార్డుల‌ను సంజ‌య్ వ‌ర్గానికి పార్టీ పెద్ద‌లు కేటాయించారు. మిగిలిన 20 వార్డులను జీవ‌న్ రెడ్డి వ‌ర్గానికి ఇచ్చారు. అయితే.. ఈ పంపకంపైనే జీవ‌న్ రెడ్డి నిప్పులు చెరుగుతున్నారు. బీఆర్ఎస్ నుంచి వ‌చ్చిన నేతకు పెద్ద పీట వేసి.. సుదీర్ఘ‌కాలంగా పార్టీలో ఉన్న త‌నను, త‌న వ‌ర్గాన్ని అవ‌మానిస్తారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇది త‌నకు తీవ్ర అవ‌మానంగా ఉంద‌న్నారు. ఈ చర్యతో తన మెడ కోసేశారని ఆవేదన వ్యక్తం చేశారు.