వైసీపీ నేతలపైనా.. ఆ పార్టీ అధినేత జగన్‌పైనా సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్నప్పుడు.. అధికారం కోల్పోయినప్పుడు కూడా వారిలో అహంకారం పోలేదన్నారు. అందుకే రెచ్చగొట్టే రాజకీయాలకు తెరదీశారని వ్యాఖ్యానించారు. నాడు-నేడు కూడా తానే బాధితుడినని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ సీనియర్ నాయకులతో సోమవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “వైసీపీ అధికారంలోఉ న్నప్పుడు నన్నే లక్ష్యంగా చేసుకుని కుటుంబంపై నానా దుర్భాషలాడారు. ఇప్పుడు కూడా అదే పనిచేస్తున్నారు. వారికి బుద్ధి రావడం లేదు“ అని వ్యాఖ్యానించారు.
తాజాగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌ల వ్యవహారంపై మాట్లాడుతూ.. “అలజడి సృష్టించేందుకే వైసీపీ నేతలు బూతు పురాణం ఎత్తుకున్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ అడ్డంగా దొరికిపోయింది. రాష్ట్ర ప్రజలంతా వైసీపీని చీదరించుకుంటున్నారు. లడ్డూ కల్తీ వ్యవహారాన్ని దారిమళ్లించేందుకే వైసీపీ నేతల బూతుల నాటకం ఎంచుకున్నారు.
వైసీపీ ట్రాప్‍లో టీడీపీ నేతలు, కార్యకర్తలు పడకూడదు.“ అని చంద్రబాబు సూచించారు. వారి ట్రాప్‌లో పడితే.. ప్రజలకు దూరమవుతామన్నారు. ప్రస్తుతం ప్రజలకు టీడీపీపై అభిమానంతో పాటు.. ఆదరణ కూడా ఉందన్నారు. దీనిని మరింత పెంచుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు.
రాష్ట్రంలో గత 20 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందన్న సీఎం చంద్రబాబు.. అన్ని వర్గాలవారు కూటమి పాలనపై సంతోషంగా ఉన్నారని తెలిపారు. పెట్టుబడుదారులు పెద్దఎత్తున రాష్ట్రానికి వస్తున్నారని చెప్పారు. దీంతో వైసీపీ నేతలు ఇక చేసేదేమీ లేక బూతులు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా రెచ్చిపోయారో.. ఇప్పుడు 11 సీట్లకు పరిమితం అయ్యాక కూడా అదేవిధంగా రెచ్చిపోతున్నారని.. టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో అలజడులు చూసి ఏపీకి ఎవరూ రాకుండా చేయాలన్నది వైసీపీ నేతల కుట్రగా పేర్కొన్నారు. వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు పార్టీ నాయకులకు సూచించారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను అదుపు చేయాలని.. ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దిగొద్దని ఆయన పేర్కొన్నారు. అలా చేయడం వల్ల.. పార్టీకి, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates