ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండు సార్లు నోటీసులు అందుకున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ దఫా కూడా.. సిట్ ముందుకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఇదే సమయంలో సిట్ నోటీసులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కూడా ఆయన ప్రయత్నా లు చేస్తున్నట్టు బీఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
1) తనపై కక్ష కట్టి.. ప్రభుత్వం వేధిస్తోందన్న కోణంలో ప్రజల మధ్యకు వెళ్లడం: ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సిట్ రూపంలో తనను వేధిస్తున్నారని.. తెలంగాణ తీసుకురాబట్టే ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న సెంటిమెంటును కేసీఆర్ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ల నున్నట్టు బీఆర్ ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
2) ఫోన్ ట్యాపింగ్ అనేది లేదనే వాదన: అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది లేనేలేదని.. గతంలోనూ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదే వాదనను కేసీఆర్ కూడా ప్రజలకు వినిపించే ప్రయత్నం చేయనున్నారు. ఇది తూతూ మంత్రం విచారణ అని.. ఎన్నికల సమయంలో తమను అష్టదిగ్భంధం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని.. ఇది పూర్తిగా రాజకీయ కుట్రేనన్నది కేసీఆర్ వాదన. ఈ క్రమంలో దీనినే ప్రజలకు వివరించనున్నారు.
సక్సెస్ ఎంత?
వాదన ఎలా ఉన్నా.. ప్రజలు ఏమేరకు విశ్వసిస్తారు? అనేది ప్రధానం. గతంలో జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో కాళేశ్వరం కమిషన్‌పై బీఆర్ఎస్ నిప్పులు చెరిగింది. ఉద్దేశ పూర్వకంగా తమను వెంటాడుతున్నారని.. కాళేశ్వరం బహుళార్ధ సాధక ప్రాజెక్టు అని కూడా చెప్పారు. కానీ, ప్రజలు ఏమనుకున్నారో.. ఏమో.. జూబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ప్రణాళికలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల్లో సిట్‌ను వినియోగించుకునే ప్రయత్నంలో ఉన్న ఆ పార్టీకి ప్రజలు ఏమేరకు సహకరిస్తారన్నది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates