2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు, ఓట్లు, సీట్ల శాతాన్ని బట్టి టీడీపీకి 60, జనసేనకు 30, బీజేపీకి 10 శాతం కేటాయింపులు పదవుల్లో జరిగేలా ఒక ఒప్పందం జరిగింది. అయితే, ఆ ఒప్పందం ప్రాక్టికల్ గా అమలు కావడం లేదని జనసేన నేత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యన్నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. పదవుల విషయంలో 60-30-10 విధానం కాగితాలకే పరిమితమవుతోందని ఆరోపించారు.
విశాఖ తూర్పు నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా తాను ఉన్నానని, ఇక్కడ 5 దేవాలయాలకు కమిటీలు వేసినా జనసేనకు చోటు దక్కలేదని బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. కారకచేట్టు పోలమాంబ అమ్మవారి ఆలయ పాలకమండలి సభ్యులుగా 11 మంది నిన్న ప్రమాణ స్వీకారం చేశారని, అందులో జనసేన తరఫున ఒక్కరు కూడా లేరని అన్నారు. జనసేన వీరమహిళలను, జనసైనికులను ఈ విషయం తీవ్రంగా నిరుత్సాహపరిచిందని చెప్పారు.
క్షేత్రస్థాయి పంపకాలలో ఈ తరహా పొరపాట్లు దాదాపు అన్ని చోట్ల జరుగుతున్నాయని తనకు ప్రతి రోజూ ఫోన్లు వస్తున్నాయని ఆరోపించారు. నామీనేటెడ్ పదవుల్లో పవన్ కళ్యాణ్ చెప్పిన 30% రిజర్వేషన్ ఏ నియోజకవర్గంలోనూ అమలు కాలేదన్నారు. జనసేన నేతలకు కూడా తమ వాటా లభించినప్పుడే కూటమి విజయానికి పనిచేస్తారని కుండబద్దలు కొట్టారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం సాధించాలంటే జనసేన వాటాను జనసేనకు ఇవ్వాలని, కూటమి ధర్మాన్ని చంద్రబాబు, పవన్ కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
అయితే, బొలిశెట్టి సత్యనారాణే కాదు…జనసేనకు పదవుల పంపకాల విషయంలో అన్యాయం జరుగుతోందని చాలామంది జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా చాలాకాలంగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అయితే, కూటమిలో ఉన్నపుడు చిన్న చిన్న సమస్యలు వస్తాయని, అలా అని కూటమిపై విమర్శలు చేసే అవకాశం వైసీపీకి ఇవ్వకూడదని పవన్ చాలాసార్లు చెప్పారు.
అందుకే, బొలిశెట్టి వంటి నేతలు ఎప్పుడూ బహిరంగంగా తమ అసంతృప్తి వెళ్లగక్కలేదు. అయితే, జనసేన కేడర్ నైతిక స్థైర్యం దెబ్బతింటున్న తరుణంలో బొలిశెట్టి ఇలా ఓపెన్ కాక తప్పలేదని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates