లడ్డూ అంశంపై అసెంబ్లీలో పవన్ చర్చ?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో సిట్ అధికారులు విచారణ జరిపారు. అయితే, ఆ లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదనని సీబీఐ తాజాగా చార్జి షీట్ దాఖలు చేసింది. అయితే, అసలు పాలతో తయారు చేసిన నెయ్యి కాకుండా కెమికల్స్ తో తయారైన నెయ్యి వాడారని కూడా అదే రిపోర్ట్ లో ఉంది. ఈ క్రమంలోనే లడ్డూ వ్యవహారంపై పవన్ తాజాగా స్పందించారు.

లడ్డూ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చిద్దామని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన ఎమ్మెల్యేలతో సమావేశం సందర్భంగా పవన్ ఈ కామెంట్లు చేశారు. గత పాలకులు రసాయనాలతో లడ్డూ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని పవన్ ఫైర్ అయ్యారు.

భక్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీసిన వైసీపీ నేతలు అరాచకాలను ప్రజలకు చెబుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా క్షేమమే ధ్యేయంగా బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాలని తన పార్టీ ఎమ్మెల్యేలకు పవన్ దిశానిర్దేశం చేశారు.

అయితే, జగన్ ను అసెంబ్లీకి రప్పించడానికి పవన్ ఈ తరహా కామెంట్లు చేసినట్లు కనిపిస్తోంది. ఎటూ జగన్ శాసన సభకు డుమ్మా కొడుతున్నారు కాబట్టి ఈ విషయంపై చర్చించేందుకైనా అసెంబ్లీకి వస్తారేమోనని పవన్ ఆ కామెంట్లు చేశారనిపిస్తోంది.

కెమికల్స్ వాడి లడ్డూ తయారు చేసిన వైనంపై జగన్ ను అసెంబ్లీలో పవన్ ఎండగట్టాలని ప్లాన్ చేసినట్లుంది. మరి, పవన్ వ్యాఖ్యలపై జగన్ స్పందించి సభలో ఆ విషయంపై చర్చకు వస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.