హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం ఒక్కరోజులోనే 24 క్యారెట్ల తులం బంగారం ధర ఏకంగా రూ. 11,770 పెరిగి రూ. 1,78,850కి చేరుకుంది. మరోవైపు వెండి ధర కూడా ఊహకందని రీతిలో కిలోకు రూ. 25,000 పెరిగి, ప్రస్తుతం రూ. 4,25,000 మార్కును తాకింది. పెరుగుతున్న ఈ ధరలు చూస్తుంటే సామాన్యుడికి వెండి కూడా బంగారంలాగే అందనంత ఎత్తుకు చేరువయ్యేలా కనిపిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ఏర్పడిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అమెరికా డాలర్ విలువ పడిపోవడం ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. అమెరికా అప్పులు పెరగడం, అంతర్జాతీయ వాణిజ్యంలో అనిశ్చితి నెలకొనడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తిగా భావించే బులియన్ మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా, గ్రీన్ టెక్నాలజీ డేటా సెంటర్ల వినియోగం పెరగడం వల్ల పారిశ్రామికంగా వెండికి డిమాండ్ విపరీతంగా పెరిగింది.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2026 ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొని వాణిజ్య వివాదాలు పరిష్కారమైతే తప్ప ఈ ధరలు తగ్గే అవకాశం లేదని స్పష్టమైంది. గత ఏడాది కాలంలో బంగారం ధరలు 100 శాతం పెరగ్గా, వెండి ధరలు ఏకంగా 272 శాతానికి పైగా పెరిగాయని నివేదిక వెల్లడించింది. ఈ స్థాయిలో వెండి ధరలు పెరగడం చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తూ తమ నిల్వలను పెంచుకోవడం కూడా మార్కెట్‌లో ధరల పెరుగుదలకు బలం చేకూర్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 5500 డాలర్లు దాటిన నేపథ్యంలో, దాని ప్రభావం భారతీయ మార్కెట్‌పై నేరుగా పడుతోంది. బులియన్ స్ట్రీట్‌లో సాగుతున్న ఈ ‘బుల్’ రన్ ఎప్పుడు ఆగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates