ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంపై నిరసనగా పాదయాత్ర చేపడుతున్నట్టు ప్రకటించిన షర్మిల తన సోదరుడు, మాజీ సీఎం జగన్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏడాదిన్నర తరువాత మరోసారి పాదయాత్ర చేయనున్నట్టు జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తన స్పందన ఏమిటని విలేకరులు ప్రశ్నించగా షర్మిల నిప్పులు చెరిగారు.
మరోసారి పాదయాత్ర అధికారం కోసమే కదా.. ఒకసారి అధికారం ఇచ్చినందుకు ఏం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాజా శేఖర్ రెడ్డి గారు మొదలు పెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేస్తానని చెప్పి అసలు పట్టించుకున్నారా? మధ్యపాన నిషేధం చేస్తానని చెప్పి కల్తీ మద్యంతో మాఫియా నడపాలేదా? అసలు గెలిచాక ప్రజల్లోకి వచ్చారా? అంటూ నిప్పులు చెరిగారు.
‘పవర్’ జగన్ రెడ్డి గారికి సూట్ అవ్వలేదని, ఆయన పద్ధతి మార్చుకొని స్వార్ధం తగ్గించుకుంటేనే మళ్ళీ దేవుడు, ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎప్పుడో 2027 లో చేయబోయే పాదయాత్రకు ఇప్పుడు ప్రకటన ఎందుకని, తాము ఇప్పుడు ప్రకటన చేసి, ఉపాధి హామికోసం ఇప్పుడే పాదయాత్ర మొదలుపెడుతున్నామని చెప్పిన షర్మిల.. మీరు చేసే పాదయాత్ర దేనికోసమని ప్రశ్నించారు.
షర్మిల వ్యాఖలు విన్న రాజకీయ విశ్లేషకులు జగన్ మోహన్ రెడ్డికి అతిపెద్ద రాజకీయ ప్రత్యర్థి షర్మిల అనడంలో ఎటువంటి సందేహం లేదంటూ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. మరి ఈ కామెంట్లకు జగన్ స్పందిస్తారా లేక ఏం వినిపించనట్టు వదిలేస్తారా అనేది వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates