టీడీపీలో ఏం జరిగినా వార్తే.. విషయం ఏదైనా కూడా… నాయకుల మధ్య చర్చ జరగాల్సిందే. తాజాగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన శిక్షణ తరగతులు కూడా రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా పార్టీ నాయకుల మధ్య చర్చకు దారితీశాయి. దీనికి కారణం.. అన్నీ తానై మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యవహరించడమే. దాదాపు 11 వందల మందికి పైగా నాయకులు, కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు సైతం పాల్గొన్నారు.
అయితే.. వాస్తవానికి చంద్రబాబు ఇప్పటి వరకు అన్నీ తానై వ్యవహరించేవారన్న విషయం తెలిసిందే. పార్టీ పరంగా నాయకుల పరంగా కూడా.. చంద్రబాబు పెద్ద ఎత్తున జోక్యం చేసుకునేవారు. కానీ.. గత ఆరు మాసాలుగా దాదాపు అన్ని వ్యవహారాలు పార్టీ కీలక నేతగా ఉన్న నారా లోకేష్ చూసుకుంటున్నారు. వివా దాల నుంచి దిశానిర్దేశం వరకు కూడా అన్నీ ఆయనే చక్క బెడుతున్నారు. ఏదైనా కీలక సమస్య ఉంటే తప్ప.. చంద్రబాబు జోక్యం పెద్దగా ఉండడం లేదు.
ఈ క్రమంలో.. తాజాగా నిర్వహించిన శిక్షణ శిబిరానికి కూడా మంత్రి లోకేషే అన్నీ తానై వ్యవహరించారు. ఈ శిక్షణను పార్టీ కేంద్ర కార్యాలయంలోని అన్ని గదుల్లోనూ నిర్వహించారు. చంద్రబాబు ఒక్క గదికే పరి మితం కాగా.. నారా లోకేష్ అన్ని గదుల్లోనూ తిరుగుతూ.. పార్టీ నాయకులను పేరుపేరునా పలకరించారు. అంతేకాదు.. శిక్షణ తరగతుల ప్రారంభ సమావేశంలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. పార్టీ భవిష్యత్తు ను ఆవిష్కరించారు. నాయకులు ఎలా మెలగాలో చెప్పుకొచ్చారు.
ఇక, చంద్రబాబు చివరిలో మాత్రమే స్పందించారు. కేవలం 20 నిమిషాలలోనే ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. ఈ పరిణామాలను చూసిన తర్వాత.. టీడీపీలో ఆసక్తికర చర్చ తెరమీదికి వచ్చింది. త్వరలోనే పార్టీ పగ్గాలను పూర్తిస్థాయిలో నారా లోకేష్‌కు ఇచ్చేందుకు చంద్రబాబు సన్నద్ధమైనట్టుగా.. పార్టీ నాయకుల మధ్య గుసగుస వినిపించింది. దీనికి పెద్దగా సమయం కూడా తీసుకోరని అంటున్నారు. వచ్చే ఏడాది మహానాడు నాటికి ఆయనకు పార్టీ అధ్యక్ష పదవిని ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates