జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్

తనను తాను జంతు ప్రేమికుడిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించుకున్నారు. అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ జంతు సంరక్షణపై తన అభిమతాన్ని చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ ఈ రోజు విశాఖపట్నం పర్యటనలో ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించారు.

పర్యటనలో ఆయన జూ పార్క్‌లోని నూతన ఎలుగుబంట్ల ఎన్‌క్లోజర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎన్‌క్లోజర్లను సందర్శించి వాటి సంరక్షణ, ఆహారం, పేర్ల వివరాలను జూ క్యూరేటర్ నుండి తెలుసుకున్నారు. ఏనుగులు, జిరాఫీలకు స్వయంగా ఆహారం అందిస్తూ, జంతు సంక్షేమంపై తమ ప్రత్యేకత చూపించారు. సీతాకోక చిలుకలతో పవన్ ఒక చిన్నపిల్లాడిలా ఆడుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ సందర్భంగా తన తల్లి అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా జూ పార్క్‌లోని రెండు జిరాఫీలను ఏడాదంతా దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. జిరాఫీల సంరక్షణకు కావలసిన మొత్తం ఖర్చును స్వయంగా భరిస్తానని ఆయన తెలిపారు.

పవన్ కళ్యాణ్ జంతు సంరక్షణలో కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం కంబాలకొండ ఎకో పార్క్‌లో నగర వనం ప్రారంభించి, చెక్క వంతెనపై కనోపీ వాక్ చేశారు. మార్గంలో మొక్కల వివరణలను అధికారులు వివరించారు. ఈ పర్యటన ద్వారా పర్యావరణ పరిరక్షణ, జంతు సంక్షేమం పై ప్రజల అవగాహన పెరుగుతుందని భావిస్తున్నారు.