సోషల్ మీడియా ప్రభావం వల్ల కలిగే నష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అతిగా సోషల్ మీడియాను వాడటం వల్ల పిల్లలు మానసిక ఒత్తిడికి మరియు ఆందోళనకు గురవ్వడమే కాకుండా, ఇతరుల జీవితాలతో పోల్చుకుంటూ అభద్రతాభావానికి లోనవుతున్నారు.
శారీరక పరంగా చూస్తే, నిరంతరం స్క్రీన్ చూడటం వల్ల నిద్రలేమి, కంటి సమస్యలు తలెత్తుతున్నాయి మరియు ఇది వారి చదువుపై ఏకాగ్రతను తగ్గించి విద్యా పనితీరు మందగించేలా చేస్తోంది. ఇదే అంశంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. నిర్ణీత వయస్సుకు లోబడిన మైనర్లకు సోషల్ మీడియాను నియంత్రించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం నియంత్రించాలని మంత్రి నారా లోకేష్ సంకల్పించారు. ఆయన నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (జీఓఎం) సమావేశంలో ఈ అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. చిన్నారుల భద్రత, సమాజంలో శాంతి భద్రతలు, డిజిటల్ వేదికలపై బాధ్యతాయుత ప్రవర్తనకు సంబంధించి స్పష్టమైన విధానాలు రూపొందించాల్సిన అవసరంపై మంత్రుల బృందం ఏకాభిప్రాయానికి వచ్చింది.
దీనిపై నారా లోకేష్ ఈరోజు ఒక ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో నమ్మకం క్రమంగా తగ్గుతోందని, పిల్లలు నిరంతర వినియోగంతో ఏకాగ్రత, విద్యాపరమైన అభివృద్ధిని కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు ఆన్‌లైన్‌లో తీవ్ర దుర్వినియోగాన్ని ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితిని ఇక నిర్లక్ష్యం చేయలేమని తెలిపారు.
దీనిపై చట్టపరమైన సమగ్ర అధ్యయనం చేయాలని జీఓఎం ఆదేశించినట్లు వెల్లడించారు. అలాగే మెటా, ఎక్స్, గూగుల్, షేర్‌చాట్ వంటి ప్రధాన సోషల్ మీడియా వేదికలను తదుపరి జీఓఎం సమావేశానికి ఆహ్వానించినట్లు తెలిపారు.
మహిళలు, పిల్లలపై సోషల్ మీడియా హానికర ప్రభావాన్ని తగ్గించి, డిజిటల్ వేదికలను మరింత సురక్షితంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
నిర్ణీత వయస్సుకు లోబడిన పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ ఇవ్వకూడదనే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి లోకేష్ సూచించారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్ అమల్లోకి వస్తే.. దేశంలోనే ఈ విషయంలో ఏపీ మోడల్ గా నిలుస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates