పిఠాపురం కోసం ఢిల్లీ వరకు.. కేంద్ర మంత్రులకు పవన్ విజ్ఞాపన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. వచ్చే నెల 1 (ఆదివారం)న కేంద్ర వార్షిక (2026–27) బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.

తొలుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను, తరువాత రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను పవన్ కలిశారు. వారికి అరకు కాఫీతో పాటు కొండపల్లి బొమ్మలను కానుకగా అందించారు.

ఈ సందర్భంగా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో నెలకొన్న సమస్యలను ఎక్కువగా కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. రైలు ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. అమృత్ పథకంలో భాగంగా కేంద్రం నిధులు ఇవ్వాలని, పిఠాపురం రైల్వే స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా మార్చాలని పవన్ కళ్యాణ్ కోరారు.

పిఠాపురంలో నెలకొన్న శక్తిపీఠం పురహూతికా అమ్మవారి విశేషాలను వివరించారు. ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతోందని, రాకపోకలకు వీలుగా రైలు కనెక్టివిటీని మరింత పెంచాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా రైల్ ఓవర్ బ్రిడ్జిలకు కూడా నిధులు ఇవ్వాలని కోరారు. అలాగే రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టుల గురించి కూడా కేంద్ర మంత్రితో పవన్ కళ్యాణ్ చర్చించారు.

ఇక హోం మంత్రితో చర్చించిన పవన్ కళ్యాణ్, ఎక్కువగా తమిళనాడు ఎన్నికలపైనే వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైనే చర్చించినట్టు తెలిపినా, అంతర్గత చర్చల్లో తమిళనాడు రాజకీయాలు, వచ్చే ఎన్నికలు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై పవన్‌తో అమిత్ షా చర్చించినట్టు జాతీయ మీడియా పేర్కొంది. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సేవలను బీజేపీ వినియోగించుకునే అవకాశం ఉందని సమాచారం.