ఆ వీడియో రచ్చపై స్పందించిన జగన్

జనసేన నేత, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ప్రభుత్వ మహిళా ఉద్యోగి లైంగిక ఆరోపణలు చేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఆ ఎమ్మెల్యేపై తాత్కాలిక చర్యలు తీసుకున్న జనసేన రాష్ట్ర కమిటీ…ఆ వ్యవహారంపై విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది. మరోవైపు, సదరు మహిళ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మరిన్ని షాకింగ్ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తొలిసారి స్పందించారు.

చంద్రబాబు ఎమ్మెల్యేలు, చంద్రబాబుకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఏ స్థాయికి వెళ్లారో అరవ శ్రీధర్ వ్యవహారం చూస్తే అర్థమవుతోందని విమర్శించారు. అసలు అతడు మనిషేనా..ఎమ్మెల్యేనేనా అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని బెదిరించి, వేధింపులకు గురి చేసి, రేప్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలు స్వయంగా సాక్షాలు, ఆధారాలతో సహా ఆరోపణలు చేసినా సరే చర్యలు లేవని విమర్శించారు.

ఇక, టీడీపీ నేత కూన రవికుమార్ వేధింపులు తట్టుకోలేక ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ ఏకంగా ఆత్మహత్యాయత్నం చేసినా…కూన రవికుమార్ పై చర్యలు లేవని విమర్శలు గుప్పించారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేశాడని, చివరకు ఆ కేసును క్లోజ్ చేయించుకున్నారని దుయ్యబట్టారు.

ప్రభుత్వ మహిళా ఉద్యోగిని మంత్రి సంధ్యారాణి పీఏ లైంగికంగా వేధించాడని, చివరకు బాధితురాలిపైనే కేసు పెట్టిన ప్రభుత్వం ఇదని విమర్శించారు. గుంటూరు ఎమ్మెల్యే నజీర్ పై కూడా న్యూడ్ వీడియో కాల్ ఆరోపణలు వచ్చినా చర్యలు లేవని అన్నారు.

ఇక, మంత్రి వాసంశెట్టి సుభాష్ ఏకంగా పబ్లిక్ గా స్టేజి ఎక్కి అశ్లీల డ్యాన్యులు చేస్తూ చిందులేస్తున్నాడని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న పనులకు జంగిల్ రాజ్యం అని కాక వేరే పేరేమైనా ఉంటుందా అని తనకు ఆశ్చర్యం కలుగుతోందని జగన్ ఎద్దేవా చేశారు.

ఘటనలు జరిగిన తర్వాత, ఆరోపణలు వచ్చిన తర్వాత వారందరినీ జైల్లో పెట్టాల్సింది పోయి….సాక్ష్యాత్తూ చంద్రబాబు, ఆయన కొడుకు, ఆయన ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని విమర్శించారు.

మొన్న సంక్రాంతి వేడుకలు ఇంకా హైలైట్ అని, ఇది ప్రభుత్వమా లేక జంగిల్ రాజ్యమా అని డౌట్ వచ్చిందని జగన్ ఎద్దేవా చేశారు. అసలు, మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా అన్న విషయం ప్రశ్నార్థకమయ్యేలా సంక్రాంతి వేడుకలు చేశారని చురకలంటించారు.

సోషల్ మీడియాలో చూస్తున్న రికార్డింగ్ డ్యాన్సుల వీడియోలు చూస్తోంటే దారుణం అనిపించిందని అన్నారు. యూనిఫాంలో ఉన్న ఒక డీఎస్పీ అయితే స్టేజి ఎక్కి మైక్ పట్టుకొని ఊపేయ్..కుదిపేయ్ అంటున్నాడని…అతడు డీఎస్పీనా..ఏం మనిషి అని అర్థం కావడం లేదని విమర్శించారు.

ఐతే వైసీపీ హయాంలో కూడా ఇటువంటివి చాలా జరిగాయని.. అప్పుడు జగన్ ఎందుకు స్పందించలేదని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.