ఇందుకే టీడీపీని రాజకీయ పాఠశాల అంటారు

గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ కార్యకర్తలు, నాయకుల కోసం శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని మొత్తం 12 విభాగాలుగా విభజించి, వెయ్యి మందికి పైగా కార్యకర్తలు, నేతలకు పార్టీ విధి విధానాలు, భవిష్యత్ ప్రణాళికలపై సీనియర్ నాయకులు అవగాహన కల్పించారు.

ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమాలు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాయి. కేంద్ర కమిటీ కార్యాలయంలోని అన్ని గదుల్లోనూ శిక్షణ తరగతులు నిర్వహించారు. పార్టీ భవిష్యత్ దిశ, ప్రజల్లోకి వెళ్లాల్సిన విధానం, రాజకీయ వ్యూహాలపై సీనియర్లు వివరించారు. కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలు, నాయకులకు అక్కడే భోజనం, టీ, కాఫీ ఏర్పాట్లు కూడా చేశారు.

ఈ శిక్షణ శిబిరానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కూడా హాజరయ్యారు. లోకేష్ అన్ని గదులకూ తిరుగుతూ శిక్షణ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో పరిశీలించారు. కార్యకర్తలు, నాయకులతో మాట్లాడారు.

అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఒక గదిలో జరుగుతున్న శిక్షణ తరగతికే పరిమితమయ్యారు. చివరి వరుసలో కుర్చీ వేసుకుని కూర్చొని, ఫోన్‌ను పక్కన పెట్టి పూర్తిగా శ్రద్ధగా తరగతిని వినడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.

ఆ గదిలో టీడీపీ సీనియర్ నేత, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పార్టీ స్వరూపం, ఎదురయ్యే భవిష్యత్ సవాళ్లు, ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. పుల్లారావు చెప్పిన ప్రతి విషయాన్ని చంద్రబాబు ఆసక్తిగా విన్నారు.

నిజానికి చంద్రబాబు వచ్చాక ఆయనే శిక్షణ ఇవ్వవచ్చని అక్కడున్న చాలామంది భావించారు. కానీ ఆయన పుల్లారావునే కొనసాగించమని చెప్పి, తాను చివరి వరుసలో కూర్చోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఆ గదిలో ఒక గంభీరమైన వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ ఎలా ఎదిగింది, ఎలా సంచలన నిర్ణయాలు తీసుకుంది, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలా ముందంజలో నిలిచిందన్న అంశాలను కూడా వివరించారు.

ఈ శిక్షణ శిబిరానికి 25 పార్లమెంటరీ కమిటీలకు చెందిన 1100 మందికి పైగా నాయకులు హాజరయ్యారు. ఇతర కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అవసరం, రాబోయే ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఎలా చేరువ చేయాలి, విజన్ 2047 ను ఎలా అర్థం చేసుకోవాలి వంటి అనేక అంశాలపై నాయకులు దిశానిర్దేశం చేశారు.

ఈ వర్క్ షాప్ ద్వారా పార్టీ నాయకులకు విధానపరమైన అంశాలపై పూర్తి అవగాహన కల్పించడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు స్పష్టమైన దిశను నిర్దేశించారు.