విజయ్ చెప్పేశాడు.. ఇక బీజేపీనే తేల్చుకోవాలి!

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు మరో రెండు మాసాల్లోనే జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ మే మధ్య ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని బీజేపీ నిర్ణయించుకుంది. కానీ దీనికి సరైన ప్రాతిపదిక, బలమైన మద్దతు లభించకపోవడం గమనార్హం.

ఇటీవల ఏఎంఎంకే పార్టీ అధినేత టీటీవీ దినకరన్‌ను ఎన్డీయే కూటమిలో చేర్చుకున్నారు. అదే విధంగా ఏఐఏడీఎంకే నుంచి ఎడప్పాడి పళని స్వామి మాజీ ముఖ్యమంత్రి కూడా కూటమిలోకి వచ్చారు. అయినా వీరు పెద్దగా ప్రభావం చూపించే పరిస్థితి కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందరి నోటా వినిపిస్తున్న పేరు, ప్రజలు కూడా ఉత్సాహంగా చూస్తున్న నేత, నటుడు విజయ్. ఆయన స్థాపించిన టీవీకే తమిళ వెట్రి కలగానికి భారీ మద్దతు ఉందని ఇప్పటికే పలు సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా యువతలో బలమైన ఫాలోయింగ్ ఉండటం, మాస్‌లో దేవుడిగా పేరు తెచ్చుకున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికలను యూ టర్న్ తిప్పే శక్తి విజయ్‌కు ఉందని విశ్లేషకులు అంటున్నారు.

దీంతో బీజేపీ సహజంగానే ఆయనపై ఆశలు పెట్టుకుంది. అందుకే గత ఏడాది టీవీకే నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందిన సందర్భంలో కూడా బీజేపీ విజయ్‌కు మద్దతు ప్రకటించింది.

కానీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బీజేపీతో పొత్తుకు విజయ్ మొగ్గు చూపకపోవడంతో కరూర్ కేసు ఎలాంటి మలుపులు తిరిగిందో అందరికీ తెలిసిందే. అంతేకాదు, ఆయన నటించిన చివరి సినిమా అని ఆయనే ప్రకటించిన జన నాయకన్‌కు ఇప్పటివరకు సెన్సార్ సర్టిఫికెట్ కూడా రాకపోవడం మరో నాటకీయ పరిణామంగా మారింది. ఈ పరిణామాల వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్న చర్చ ఒకవైపు సాగుతోంది.

మరోవైపు విజయ్ మాత్రం తన పంథాను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోబోనని తెగేసి చెబుతున్నారు.

తాజాగా ఆదివారం సాయంత్రం మహాబలిపురంలో నిర్వహించిన సభలో విజయ్ తన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన విజిల్ గుర్తును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నికల విషయంలో ఆయన వైఖరిని స్పష్టంగా చూపిస్తున్నాయి.

“మరికొద్ది నెలల్లో జరిగేది ఎన్నికల పోరు కాదు.. ప్రజాస్వామ్య యుద్ధం” అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఆ పోరుకు తగిన సైన్యం తమ వద్ద ఉందంటూ యువతను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

“ఎవరికీ తలవంచం.. దేనికీ రాజీపడే ప్రసక్తే లేదు” అని బల్లగుద్ది చెప్పారు.

అంతిమంగా ఇప్పటివరకు “విజయ్ వస్తాడు.. విజయం తెస్తాడు” అని ఎదురుచూసిన బీజేపీ ఇప్పుడు తన భవిష్యత్తు ఏంటో తేల్చుకునే సమయం ఆసన్నమైంది.