మున్సిపల్ సమరంలో కవిత… కానీ ఎలా?

తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న మునిస‌ప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని బీఆర్ ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మాజీ ఎంపీ క‌విత నిర్ణ‌యించారు. త్వ‌ర‌లోనే ఆమె తెలంగాణ జాగృతి పేరుతో సొంత పార్టీ పెట్టుకుంటున్న విష‌యం తెలిసిందే.

దీనికి సంబంధించిన రిజిస్ట్రేష‌న్‌, గుర్తు, జెండా రూప‌కల్ప‌న వంటి ప‌నుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో తాము మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోమ‌ని ఇటీ వ‌ల ఆమె ప్ర‌క‌టించారు.

2029లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనే తాము పోటీ చేస్తామ‌ని కూడా క‌విత ప్ర‌క‌టించారు. దీంతో మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ర‌ని క్లారిటీ ఇచ్చిన‌ట్టు అయింది. అయితే.. అనూహ్యంగా నిర్ణ‌యం మార్చుకున్నారు.

తాజాగా మునిసిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు క‌విత అనుచ‌రులు చెబుతున్నారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు, ఆమె అభిమానులు.. ముఖ్యంగా మ‌హిళా నాయ‌కుల నుంచి పెద్ద ఎత్తున వ‌చ్చిన డిమాండ్ల నేప‌థ్యంలో స్థానిక ఎన్నిక‌ల‌లో పోటీకి సిద్ధ‌మ‌య్యారు.

కానీ, ఎలా?

అయితే.. ఇక్క‌డ పెద్ద స‌మ‌స్య ఏంటంటే.. క‌విత పార్టీ ఏదైనా ఇంకా రిజిస్ట్రేష‌న్ క్ర‌తువు పూర్తి చేసుకునేందుకు మూడు మాసాల స‌మ‌యం ప‌డుతుంది. దీని త‌ర్వాత వెరిఫికేష‌న్ కూడా ఉంటుంది. పార్టీ గుర్తుపై అభ్యంత‌రాల సేక‌ర‌ణ‌.. జెండా నిర్ధార‌ణ‌.. ఇలా అనేక అంచెలు దాటుకుని ముందుకు సాగితే త‌ప్ప‌.. క‌విత పార్టీకి ఒక రూపం రాదు.

కానీ, ఈలోగానే స్థానిక ఎన్నిక‌లు ముగిసిపోనున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆమె.. కీల‌క నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

అఖిల భార‌త ఫార్వ‌ర్డ్ బ్లాక్‌(ఏఐఎఫ్‌బీ) పార్టీ త‌ర‌ఫున త‌న పార్టీ వారిని నిల‌బెట్టేందుకు క‌విత చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు తెలిసింది. ఈ పార్టీ ఎన్నిక‌ల గుర్తు సింహం. దీనిపైనే పోటీ చేయబోతున్నట్టు క‌విత అనుచ‌రులు.. ఆమె పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ప్ర‌స్తుతం దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. దీంతో స్థానికంగా త‌న ప‌ట్టును నిల‌బెట్టుకునేందుకు.. ప్ర‌జ‌ల్లో చ‌ర్చ పెట్టేందుకు ఈ ఎన్నిక‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని క‌విత భావిస్తున్నారు. 2029 ఎన్నిక‌ల వ‌ర‌కు అంటే.. చాలాస‌మ‌యం ఉండ‌డంతో ఇప్పుడు స్థానిక ఎన్నిక‌లే బెట‌ర్ అనే భావ‌న ఉంది.