కర్ణాటకలోని బళ్లారిలో మైనింగ్ వ్యాపారవేత్త, బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 1న ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో కాంగ్రెస్ కార్యకర్త ఒకరు మృతి చెందారు. జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. ఆ గొడవను కంట్రోల్ చేయలేదని ఆ ఏరియా ఎస్పీని సస్పెండ్ చేశారు.
అయితే, ఆ అవమానాన్ని భరించలేక ఆయన ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. ఆ వ్యవహారం సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలోనే తాజాగా గాలి జనార్థన్ రెడ్డికి చెందిన ఒక భవనాన్ని గుర్తు తెలియని దుండగులు తగులబెట్టారు.
రూ.3 కోట్ల విలువైన మోడల్ హౌస్ కిటికీలు, తలుపులు పగులగొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో ఆ ఇంట్లో గాలి జనార్థన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. అసెంబ్లీ సమావేశాల కోసం బెంగుళూరు వెళ్లారు. ఈ ఘటనపై జనార్థన్ రెడ్డి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే, ఈ ఘటన వెనుక ఎమ్మెల్యే భరత్ రెడ్డి హస్తముందని గాలి జనార్థన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. జనవరి 1న కూడా గొడవ జరుగుతున్న సమయంలో గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద భరత్ రెడ్డి వర్గీయులు కాల్పులకు తెగబడ్డారని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates