జ‌గ‌న్ అప్పుల‌కు వ‌డ్డీలు తగ్గించిన చంద్రబాబు

ఏపీలో జ‌గ‌న్ ప‌రిపాల‌నా కాలంలో చేసిన అప్పుల కార‌ణంగా రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ పూర్తిగా గాడి త‌ప్పింద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. దానిని స‌రిదిద్దేందుకు త‌మ‌కు స‌మ‌యం స‌రిపోవ‌డం లేద‌న్నారు. లెక్క‌కు మించి.. అందిన కాడికి అప్పులు చేశార‌ని.. ఈ సొమ్మును ఏం చేశారో కూడా తెలియ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు.

“కొన్ని అప్పులు క‌నిపిస్తున్నాయి. ఇంకా ఎన్నో ఉన్నాయ‌ని అధికారులు చెబుతున్నారు. అధికారికంగా ఆ సొమ్మును ఎక్క‌డ ఖ‌ర్చు పెట్టారో కూడా తెలియ‌డం లేదు. ఇంకా ఎన్ని రోజులు ప‌డుతుందో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితినెల‌కొంది. ఈ ప‌రిస్థితి చూస్తే.. గుండె త‌ర‌క్కుపోతోంది.` అని చంద్ర‌బాబు అన్నారు.

తాజాగా బ్యాంక‌ర్ల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో సీఎం చంద్ర‌బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. సుమారు 5 గంట‌ల పాటు వివిధ బ్యాంకుల ఉన్న‌తాధికారుల‌తో సీఎం చంద్ర‌బాబు భేటీఅయ్యారు. ఈ సంద‌ర్భంగా గ‌త వైసీపీ హ‌యాంలో చేసిన అప్పుల విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. అప్ప‌ట్లో చేసిన అప్పుల‌కు ఇప్పుడు వ‌డ్డీల రూపంలో భారం పెరిగిపోయింద‌న్నారు.

అయితే.. ఆనాడు చేసిన అప్పులను రీషెడ్యూల్‌(మార్పు) చేయ‌డం ద్వారా 1180 కోట్ల రూపాయ‌లను ఆదాచేశామ‌ని తెలిపారు. ఇది వ‌డ్డీల‌రూపంలో చెల్లించాల్సిన సొమ్మేన‌ని.. రాష్ట్ర‌ పర‌ప‌తి పెర‌గ‌డంతో బ్యాంకులు వ‌డ్డీలు త‌గ్గించాయ‌ని వివ‌రించారు.

ఏటా వ‌డ్డీల భారం పెరుగుతున్న నేప‌థ్యంలో బ్యాంకులు స‌హ‌క‌రించాయ‌ని చంద్ర‌బాబు తెలిపారు. కార్పొరేష‌న్లు స‌హా.. ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌ను కూడా తాక‌ట్టు పెట్టి అప్పులు తెచ్చార‌ని చంద్ర‌బాబు అన్నారు. ఇప్పుడు వాటిని బ‌య‌ట ప‌డేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని వివ‌రించారు.

ప్ర‌స్తుతం ఏపీ-బ్రాండ్ పెరుగుతున్న నేప‌థ్యంలో వివిధ కీలక రంగాలు అభివృద్ధి జరిగేలా బ్యాంకర్ల సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా ప్ర‌భుత్వ ఆదాయం పెర‌గాలంటే.. సూక్ష్మ‌, చిన్న వ్యాపారుల లావాదేవీలు పెర‌గాల్సి ఉంటుంద‌ని.. వారికి విరివిగా బ్యాంకులు రుణాలు ఇచ్చి స‌హ‌క‌రించాల‌ని కోరారు.

ఇంగితం కూడా లేకుండా వ్య‌వ‌హ‌రించారు…

జ‌గ‌న్ పాల‌న‌లో వ్య‌వ‌స్థ‌ల‌ను ఇష్టారాజ్యంగా వాడుకున్నార‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. దీంతో ప్ర‌భుత్వానికి, రాష్ట్రానికి కూడా క్రెడిబిలిటీ(విశ్వ‌స‌నీయ‌త‌) పోయింద‌న్నారు.

“డ‌బ్బులు వ‌స్తే చాలు.. వ‌డ్డీ ఎంత‌న్న‌ది కూడా చూడ‌కుండా తెచ్చారు. ఇప్పుడు ఎవ‌రు క‌ట్టాలి? అంతిమంగా ప్ర‌జ‌ల‌పైనే ఈ భారం ప‌డుతుంద‌న్న ఇంగితం కూడా లేకుండా వ్య‌వ‌హ‌రించారు. అదేమంటే క్రెడిట్ చోరీ అంటున్నారు. వీరికి మాన‌సిక స్థితి స‌రిగాలేదు“ అని చంద్ర‌బాబు వైసీపీ నేత‌ల‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. మ‌రో 2 లక్షల కోట్ల మేర రుణాలను రీషెడ్యూల్‌ చేసుకునే అవకాశం ఉందని.. దీనికి కూడా బ్యాంక‌ర్లు స‌హ‌క‌రించాల‌ని కోరారు.