హీరోయిన్లతో లింకులపై స్పందించిన కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులతోపాటు తమ అందరి ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారని షాకింగ్ ఆరోపణలు చేశారు.

సింగరేణి బొగ్గు స్కాం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ అంటూ తమకు నోటీసులిస్తున్నారని ఆరోపించారు. 10 సార్లు పిలిచినా సిట్ విచారణకు హాజరవుతానని అన్నారు. తప్పు చేయని తాను భయపడాల్సిన పనిలేదని, సిట్ విచారణలో ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానని, ఈ కేసులు తనకు కొత్తేమీ కాదని అన్నారు.

తాను పుట్టిన మట్టి సాక్షిగా చెబుతున్నానని, తాను ఎటువంటి తప్పు చేయలేదని కేటీఆర్ అన్నారు. తనకు హీరోయిన్లతో సంబంధం అంటగట్టారని, తన వ్యక్తిత్వహననానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఆ అసత్య ఆరోపణల వల్ల తన కుటుంబం ఎంతో ఇబ్బంది పడిందని, అయినా సరే తట్టుకొని నిలబడ్డానని ఎమోషనల్ అయ్యారు.

తనకు లేనిపోని లింకులు అంటగట్టి తనపై తప్పుడు ప్రచారం చేసిన రేవంత్, ఆయన తొత్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోనని వార్నింగ్ ఇచ్చారు.

4 కోట్ల తెలంగాణ ప్రజలను మోసం చేసి, నయవంచనకు పాల్పడ్డ ముఖ్యమంత్రిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ అంటూ కొత్త ఆరోపణలతో కాలయాపన చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు పోరాడతామని అన్నారు. రాజకీయ కక్షలకు పాల్పడినప్పటికీ ఈ ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు.