స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేష్‌లు తిరుగు పయనమయ్యారు. నాలుగు రోజులు జరిగిన ఈ సదస్సులో భారత్ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, అసోం, ఏపీ సహా పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు.. మంత్రులు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు ఈ పర్యటనపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు.
ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు చెందిన పలువురు పారిశ్రామిక వేత్తలు సహా.. దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, సీఈవోలతో ఆయన భేటీ అయ్యారు. ఈ క్రమంలో అమరావతిలోని స్పోర్ట్స్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు రతన్ టాటా సంస్థ అంగీకరించింది. విశాఖలో పెట్టుబడులకు ముఖ్యంగా ఐటీ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఇక, మంత్రి నారా లోకేష్ కూడా.. పలు సంస్థలతో పెట్టుబడులపై చర్చించారు. ఈ క్రమంలో ఆయా సంస్థలు వచ్చేందుకు అంగీకరించాయి.
+ ఐటీ హబ్ గా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్ ఐటీ డెవలప్ మెంట్ సెంటర్, జీసీసీ, వర్టికల్ బీపీఎం కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు క్యాప్ జెమినీ సంస్థ అంగీకరించింది.
+ డిజిటల్ టాలెంట్ పైప్ లైన్ కో డెవలప్ మెంట్, ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్‌లు, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఇంజనీరింగ్ కోసం ఏపీ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో పనిచేసేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ముందుకు వచ్చింది.
+ భారత్ లో ఏఐ, క్లౌడ్-రెడీ వర్క్‌ఫోర్స్‌ను నిర్మించడానికి 45 వేల మంది ఉద్యోగుల నియామక ప్రణాళిక రూపొందించినట్లు క్యాప్ జెమిని సీఈవో ఐమన్ ఎజ్జట్ తెలిపారు.
+ బ్లాక్ స్టోన్ సంస్థ ఎంబసీ ఆఫీస్ పార్క్స్, నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ వంటి సంస్థల ద్వారా విశాఖపట్నంలో గ్రేడ్ ఎ ఆఫీస్ స్పేస్, ఇంటిగ్రేటెడ్ మిక్స్ డ్ యూజ్ డెవలప్ మెంట్ లో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది.
+ టెక్ మహీంద్ర సంస్థ.. విజయవాడలో టెక్ మహీంద్ర ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దీని వల్ల 6 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. విశాఖపట్నంలో డెలివరీ విస్తరణ పనులను వేగవంతం చేయనుంది. వైజాగ్ లో టెక్ మహీంద్రా స్కిల్లింగ్ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. దీంతో 3 వేల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates